మహిళా ఎంపీడీవోపై మంత్రి ఎర్రబెల్లి చేసిన కామెంట్స్ పై రచ్చ నడుస్తుండగానే.. మరో మంత్రి నోరు పారేసుకున్నారు. అహంకార ధోరణితో ఓ విద్యార్థి, అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్టూడెంట్స్ యూనియన్లు భగ్గుమంటున్నాయి.
కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఆవరణలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించే పనుల్ని పర్యవేక్షించేందుకు మంత్రి గంగుల కమలాకర్ వెళ్లారు. ఆయనతోపాటు జిల్లా కలెక్టర్, మేయర్, అనుచరులు, మందీమార్బలం అంతా ఉన్నారు. అయితే కాలేజీ కాంపౌండ్ లో నిర్మాణాలు చేపట్టడమేంటని ఓ విద్యార్థి మంత్రిని నిలదీశాడు. దీంతో అసహనంతో ఊగిపోయిన గంగుల.. విద్యార్థిపై దురుసుగా ప్రవర్తించారు.
నీ ఊరు ఎక్కడ..? ఈ స్థలం SRR కాలేజీదా..? స్పోర్ట్స్ అథారిటీకి చెందినది..? వాడ్ని పక్కకు తీసుకెళ్లి.. రెండు సంపండి అంటూ పోలీసులను పురమాయించారు. అదే సమయంలో ఓ అధికారిని నీకేమీ తెల్వదు.. నోరు మూసుకో అని మాట్లాడారు. దీంతో గంగులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడడం ఏంటని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనుమానం వచ్చినప్పుడు దాన్ని చక్కగా వివరించి చెప్పాలి గానీ.. ఇలా మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.
ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి.. మహిళా ఎంపీడీవో గురించి అసభ్యకరంగా మాట్లాడంతో మహిళా కమిషన్ వరకు వెళ్లింది. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విద్యార్థి, అధికారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు మంత్రి గంగుల కమలాకర్. ఈయన కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు.