తెలంగాణలో కొత్త పార్టీల రాకపై పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమాలకర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రంలో ఎవరైనా కొత్త పార్టీ పెడితే వారికి పుట్టగతులు ఉండవంటూ గంగుల చేసిన వ్యాఖ్యలు.. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌నే ఉద్దేశించి చేసినవేనన్న గుసగుసల వినిపిస్తున్నాయి. ఈటెల పార్టీని వీడుతున్నారని, కొత్త పార్టీ పెడుతున్నారని ఇటీవల ఓ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే గంగుల అలా మాట్లాడటం చర్చనీయాంశమైంది. టీఆర్‌ఎస్‌లో ధిక్కార స్వరానికి చోటు లేదని గంగుల చెప్పడం కచ్చితంగా ఈటెలను టార్గెట్ చేయడమేనని అంటున్నారు విశ్లేషకులు.
గంగుల మాట్లాడిన మాటలు షర్మిల కొత్త పార్టీపైనేనని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నా.. ఆయన అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. షర్మిల సాకుతో ఈటెల రాజేందర్‌కు కౌంటర్ ఇచ్చారని వారు అంటున్నారు. వాస్తవానికి ఈటెల, గంగుల మధ్య ఎప్పటి నుంచో విబేధాలు ఉన్నాయని అంటుంటారు జిల్లా నేతలు. తాజాగా గంగుల వ్యాఖ్యలతో మరోసారి ఇద్దరి మధ్య మరోసారి అవి బయటపడ్డాయని అభిప్రాయపడుతున్నారు.