– కరీంనగర్ జిల్లాలో రాజ్యమేలుతున్న రాజకీయం
– పనికావాలంటే పీఏను కలవాల్సిందే
– మంత్రులకంటే.. పీఏ, పీఆర్వోలకే ఎక్కువ డిమాండ్
– కేసు కాకుండా చేస్తానని లక్ష రూపాయల డిమాండ్
– సీపీతో మాట్లాడాను..నేనున్నానని హామీ
– మంత్రి గంగుల కమలాకర్ పీఆర్వో మళ్లికార్జున్ గనకార్యం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గర నుండి ఆయన ఇంట్లో పని చేసే పని మనిషి వరకు డిమాండ్ పెరిగి పోయింది. ఇంకా చెప్పాలంటే.. ఎమ్మెల్యేల కంటే.. వాళ్ల పీఏలకు, పీఆర్వో లకే ఎక్కువ డిమాండ్ ఉన్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. కబ్జాల దగ్గర నుండి సెటిల్మెంట్ ల వరకు దగ్గరుండి వాళ్లే చూసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పోలీసులతో సన్నిహతంగా ఉంటూ.. చిన్న పిట్టీ కేసుల నుండి పెద్ద కేసుల వరకు సెటిల్మెంట్ చేస్తూ.. తమ వద్దకు వచ్చిన వారి నుండి అధిక మొత్తంలో డబ్బులు కాజేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో జరిగింది.
కరీంనగర్ జిల్లాలో పోలీసులు స్థానిక వాటర్ ప్లాంట్ లపై దాడులు నిర్వహించారు. నగరంలో వాటర్ ప్లాంట్లలో కల్తీ జరుగుతుందని అందిన సమాచారంతో కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు.. నగర వ్యాప్తంగా పలు వాటర్ ప్లాంట్లపై పోలీసులు మెరుపు దాడి చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించని పలువురిపై కేసు నమోదు చేసి.. ఆయా ప్లాంట్లను సీజ్ చేశారు.
పోలీసుల జరిపిన దాడిల్లో భాగంగా సుభాష్ నగర్ లోని ఓ ప్లాంట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సదరు వాటర్ ప్లాంట్ యజమాని మంత్రి గంగుల కమలాకర్ పీఆర్వో బోనాల మల్లిఖార్జున్ ను ఆశ్రయించాడు. పోలీసు కేసు లేకుండా చూడాలని స్టేషన్ బెయిల్ ఇప్పించాలని వేడుకున్నాడు.
అయితే.. సీఐ, ఏసీపీ తనకు దగ్గరని.. స్టేషన్ బెయిల్ తో పాటు.. నాలుగు రోజుల్లో కేసుకూడా లేకుండా చూస్తానని వాటర్ ప్లాంట్ యజమానికి హామీ ఇచ్చాడు మళ్లికార్జున్. ఇదే విషయమై ఇప్పుడే ఏసీపీతో మాట్లాడాను అని.. కాకపోతే వాళ్లు డబ్బులు తీసుకుంటారని చెప్పాడు. కేసు లేకుండా చేయడానికి సుమారు రూ. 1 లక్ష వరకు ఖర్చు అవుతోందని తెలిపాడు మళ్లికార్జున్.
కేసు మాఫీ కావాలంటే త్వరగా డబ్బులు తయారు చేసుకో అంటూ ఆర్డర్ వేశాడు. నీ సమస్యను ఏసీపీతో మాట్లాడానని.. అమౌంట్ కూడా సెటిల్ చేశానని చెప్పాడు. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని.. బయట తెలిస్తే ఏసీపీ మనకు సపోర్ట్ చేయడని సదరు వాటర్ ప్లాంట్ యజమానిని భయపెట్టాడు గంగుల పీఆర్వో.
అందుకు అంగీకరించిన సదరు వాటర్ ప్లాంట్ యజమాని.. తనను ఒక సారి పోలీస్ స్టేషన్ కు రమ్మని వేడుకున్నాడు. అందుకు అతను సమాధానంగా నేను మంత్రి పీఆర్వోను.. అక్కడికి వెళ్లి నా పేరు చెప్పు.. సమస్య క్లియర్ అవుతోందని చెప్పాడు. “అయినా నేను వాళ్ల దగ్గరకు రావడం ఏంది.. వాళ్లే నా దగ్గరకు రావాలి కాని.. నువ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మంత్రి గంగుల కమలాకర్ పీఆర్వో మళ్లికార్జున్ సారు పంపిచాడని చెప్పి కలువు.. నీ పని అయిపోతది..” అని గట్టిగా హామీ ఇచ్చి పంపాడు.
ఇప్పుడు ఇదే విషయం ఉమ్మడి జిల్లా అంతా కోడై కూస్తోంది. మంత్రి పీఆర్వో ఇస్తున్న హామీ చూస్తుంటే.. పోలీసులకు రాజకీయ నాయకులకు మధ్య కమ్యూనికేషన్ ఉందో అర్ధమవుతోందంటూ గుసగుసలాడుతున్నారు. అసలు మంత్రి పీఆర్వోకే ఇంత మొత్తంలో సంపాదన ఉంటే.. మరి మంత్రి గారి పరిస్థితి ఏంటి..? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు కరీంనగర్ ప్రజలు. ఈ విషయంలో పోలీసులు రాజకీయ నాయకులు నాయకులు చెప్పినట్టు విని కేసును లేకుండా చేస్తారా..? నిబంధనలకు విరుద్దంగా.. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వ్యవహరించినందుకు ప్లాంట్ యజమానిపై కేసు నమోదు చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే అంటున్నారు కరీంనగర్ ప్రజలు.