ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం, టీఆర్ఎస్ మధ్య యుద్ధం జరుగుతోంది. టీఆర్ఎస్ నేతలు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో కూడా నిరసన కార్యక్రమానికి ప్లాన్ చేశారు. కేంద్రం దిగొచ్చి మద్దతు ధరకు ఆఖరి గింజ కొనేవరకూ అవిశ్రాంతంగా పోరాడతామని గులాబీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు మంత్రి గంగుల కమలాకర్.
కేంద్రం తీరును ఎండగడుతూ ఓ దున్నపోతను తీసుకొచ్చారు. దాని ఒంటిపై కేంద్రం అని రాశారు. రోడ్డుపై దున్నపోతుతో కలిసి నిరసన చేపట్టారు. మంత్రి గంగుల కమలాకర్ సహా ఇతర టీఆర్ఎస్ నేతలు అందరూ పాల్గొన్నారు. అయితే.. ఓ కార్యకర్త అత్యుత్సాహం చూపించాడు.
దున్నపోతు కొమ్ములకు టీఆర్ఎస్ కండువా చుట్టాడు. దీంతో గుంగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మనం చేస్తున్న ధర్నా ఏంటి.. నువ్వు చేస్తోందేంటి.. అంటూ కింగ్ సినిమాలో బ్రహ్మానందం లెవల్ లో ఆ కార్యకర్తకు క్లాస్ పీకారు. ఇతర నాయకులు చెప్పడంతో కాసేపటికి చల్లబడ్డారు.
దున్నపోతు మీద వర్షం కురిసినట్లు.. అనే సామెతను గుర్తు చేస్తూ కేంద్రం తీరుకు నిరసనగా నీళ్లు చల్లారు టీఆర్ఎస్ నేతలు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గంగుల గరం గరం వీడియో వైరల్ అవుతోంది.