టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల ఘర్షణతో సిరిసిల్ల రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎల్లారెడ్డిపేటకు వెళ్తుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రాజాసింగ్ తో మాజీ మంత్రి చంద్రశేఖర్, కూన శ్రీశైలం సహా పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.
సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల కారణంగా శుక్రవారం రాత్రి టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. అయితే.. గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు రాజాసింగ్ వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని.. అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మరోవైపు బీజేపీ దాడులను సహించబోం అంటూ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఇలాంటివి పునరావృతమైతే బీజేపీ నేతల ఉనికే లేకుండా చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ నేతల మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దన్నారు. దాడి చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. తమ బలం ముందు బీజేపీ బలం చాలా చిన్నదని చెప్పారు.
ఇటు రాత్రి జరిగిన గొడవలో బీజేపీ నేత రెడ్డబోయిన గోపి.. గన్ తీసుకొచ్చి బెదిరించారని మంత్రి గంగుల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో గోపి గన్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు కలెక్టర్.