చిన్నపాటి వర్షాలకే తెలంగాణలోని నగరాలు, పట్టణాలు నీట ఎందుకు మునుగుతున్నాయో ఇన్నాళ్లు ప్రజలకు పెద్దగా అర్థమయ్యేది కాదు. డ్రైనేజీలు సరిగా లేకనో, వర్షపు నీటిని మళ్లించడంలో ప్రభుత్వంవిఫలం కావడంవల్లో అని అంతా అనుకునేవారు. రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల సంగతేమోగానీ.. కరీంనగర్‌లో వరదలకు కారణం ఏమిటో మంత్రి గంగుల తేల్చేశారు. తాజా వరదలకు కారణం సీఎం కేసీఆర్ చేసిన ఓ పనేనంటూ సెలవిచ్చారు.
గతంలో గ్రౌండ్ వాటర్ ఎక్కువగా లేకపోవడంతో నగరంలో వర్షాలుపడితే ఆ నీరు నేరుగా గ్రౌండ్లోకి ఇంకిపోయి భూగర్భ జలాలుగా మారేదన్న గంగుల.. కాళేశ్వరంతో గత సీజన్ నుంచి అన్ని జలాశయాలు నిండి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిందని, అందుకే చిన్నవర్షం వచ్చిన అది వరదగా మారుతోందని అద్భుతంగా విశ్లేషించారు. గంటలో వరద నీరంతా వెళ్లిపోతుందని.. ప్రజలకు ఏ ఇబ్బంది ఉండదని అభయమిచ్చారు. ప్రకృతి విపత్తులు చెప్పి రావని… చెప్పుకుంటూపోయారు.
మంత్రి మాటలు విన్నవారంతా ఇప్పుడు నోరెళ్లబెడుతున్నాడు. కాళేశ్వరం నీళ్లు దరిదాపుల్లో కూడా లేని పట్టణాలు కూడా నీట మునిగాయని.. అందుకు కారణం ఏమిటో కూడా ఆయన చెప్తే బాగుండని అంటున్నారు. కాళేశ్వరంతో కరీంనగర్‌లో గ్రౌండ్ వాటర్ పెరిగాయా.. లేక తెలంగాణ అంతటా పెరిగాయా చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.