అకాల వర్షాల వల్ల పంట దెబ్బ తిన్న రైతులకు నష్టపరిహారంగా సీఎం కేసీఆర్ రూ.10 వేలు ప్రకటించి మరోసారి రైతు బిడ్డ అని నిరూపించుకున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన బీజేపీ నేత బండి సంజయ్ పై మండిపడ్డారు. గుజరాత్ లో ఎందుకు ఫసల్ బీమా యోజన అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
వ్యవసాయం గురించి, రైతుల గురించి వారి కష్టాల గురించి బీజేపీ వారు మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లే అని విమర్శించారు. తెలంగాణలో ఫసల్ బీమా అమలు గురించి అడుగుతున్న బండి సంజయ్ ముందు గుజరాత్ లో ఆ పథకం ఎందుకు అమలు చేయడం లేదో కనుక్కోవాలన్నారు. దేశంలోని 10 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని పార్లమెంట్ సాక్షిగా బీజేపీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్వయంగా చెప్పారు.
దీన్ని బట్టి చూస్తే ఈ పథకంతో వ్యవసాయదారులకు పెద్దగా ఉపయోగం లేదని అర్థం అవుతుందని ఆయన అన్నారు. కేసీఆర్ రైతుల కోసం రూ.228 కోట్లు ప్రకటిస్తే బీజేపీ నేతలకు ఇది చిన్న సాయంగా కనిపించడం వారి దురదృష్టం అన్నారు. దేశంలో ఇంతకన్నా ఎక్కువ సాయం ఇంకెక్కడైనా చేసినట్లు నిరూపించగలరా? అంటూ సవాల్ విసిరారు.
నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, నేడు ఆదానీ ఆదాయాన్ని డబుల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎంత సేపు రైతులను బలి చేసిన చరిత్ర మీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత మాది. సాగు, రైతు సంక్షేమం గురించి బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ మంత్రి సంజయ్ పై మండిపడ్డారు.