హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి నీళ్లు రావద్దనే లక్ష్యంతో ప్రతిపక్షాల కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు మంత్రి హరీష్ రావు. గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో సిద్దిపేటలో మీడియాతో మాట్లాడారు మంత్రి. నాడు మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ జలాశయ పనులను సైతం అడ్డుకుని పోలీసులపై తిరగబడేలా చేసి చివరకు ప్రతిపక్షాలు తప్పుకున్నాయని మండిపడ్డారు. పరిహారం విషయంలో ప్రభుత్వం నిర్వాసితులతో ఎన్ని సార్లైనా చర్చించడానికి సిద్ధంగా ఉందన్నారు.
రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఇంజనీర్లు ట్రయల్ రన్ నిర్వహించేందుకు వెళితే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. వారిపై దాడి చేయడంతోనే పోలీసులు కలుగజేసుకున్నారని తెలిపారు. నిర్వాసితులకు అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు. గౌరవెల్లి నిర్వాసితులు ప్రతిపక్షాల మాయలో పడొద్దని సూచించారు. ప్రజలు, రైతులు బాగుపడటం ఇష్టం లేకే ప్రతిపక్షాలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.
2013 చట్టం ప్రకారం ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తామన్న హరీష్.. ఇప్పటి వరకు 3,816 ఎకరాల భూ సేకరణ చేపట్టామని, ఇంకా కేవలం 84 ఎకరాల భూమి మాత్రమే నిలిచిపోయిందన్నారు. నిర్వాసితులు కోర్టుకు వెళితే వారి పరిహారం కోర్టులో డిపాజిట్ చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గౌరవెల్లి నిర్వాసితులకు ఎకరానికి 15 లక్షల పరిహారం ఇస్తున్నామని వివరించారు. 98.58 శాతం చెల్లింపులు జరిగిపోగా 1.45 శాతం ఇండ్లకు మాత్రమే పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు.
మరోవైపు సిద్దిపేటలో భూనిర్వాసితులు, మంత్రి హరీశ్ రావుకు మధ్య గంట పాటు చర్చలు జరిగాయి. చిన్నకోడూరు మండలం మెట్టుబండల వద్ద మంత్రిని భూనిర్వాసితులు, మాజీ ఎంపీ పొన్నం, కాంగ్రెస్ నేతలు కలిశారు. గౌరవెల్లి భూనిర్వాసితులకు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. హరీశ్ రావుకు వారి బాధలను తెలిపారు.