సికింద్రాబాద్ అల్లర్ల వెనుక టీఆర్‌ఎస్, ఎంఐఎం హస్తం ఉందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు స్పందించారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. రూ.37 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. కార్యక్రమంలో బాగంగా మాట్లాడిన హరీశ్.. ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడుల వెనుక టీఆర్‌ఎస్ హస్తం ఉంటే.. మరి ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న అల్లర్ల వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు.
ఆర్మీ ఉద్యోగాలకు అగ్నిపథ్ పేరుతో కేంద్రం మంగళం పాడుతోందని ఆరోపించారు హరీశ్. ఆర్మీని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందన్న ఆయన.. కేంద్రం నిర్ణయంతో దేశంలో అగ్గి రాజుకుందని చెప్పారు. బీజేపీ మాటలు తీయగా, చేతలు చేదుగా ఉంటాయని తెలిపారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజావ్యవతిరేక నిర్ణయాలతో ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటోందని విమర్శించారు హరీశ్ రావు. యువకుల బాధ కేంద్రానికి అర్థం కావడం లేదన్న ఆయన.. బండి సంజయ్, డీకే అరుణ అవగాహనలేమితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.