టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు హుజూరాబాద్‌లో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నో ఉప ఎన్నికలను సక్సెస్‌ఫుల్‌గా డీల్ చేసిన ఆయనకు.. మునుపెన్నడూలేని అనుభవాలు అక్కడ ఎదురవుతున్నాయి. సాధారణంగా హరీష్ రావు ఎప్పుడు, ఎక్కడ ఏ ఎన్నికల గెలుపు బాధ్యతను తీసుకున్నా.. ఆయన ముందుగా గురిపెట్టేది ప్రత్యర్థుల బలం, బలగాన్నే. అంటే తమకు పోటీగా ఉన్న పార్టీలోని ముఖ్యమైన నేతలని గులాబీ గూటికి చేర్చి..షార్ట్‌కట్‌లో, షార్ట్ టైమ్‌లో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకోవడంలో హరీష్ రావు ఆరితేరిపోయారు. కానీ హుజూరాబాద్‌కు వచ్చేసరికి అందుకు భిన్నమైన పరిస్థితులు, అనుభవనాలు ఆయనకు సవాల్ విసరుతున్నాయని తెలుస్తోంది.
ఈటల రాజీనామా తర్వాత.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ రెండు వర్గాలు చీలిపోయింది. ఈటలపై అభిమానంతో కొందరు ఆయన వెంట వెళ్లగా.. మరికొందరు పార్టీలోనే ఉండిపోయారు. అయితే వెళ్లిపోయిన ఆ కొందరిని వెనక్కి తీసుకురావడానికి హరీష్ రావు ఎంత ప్రయత్నిస్తున్నా, ఎన్ని పాచికలు వేస్తున్నా పారడం లేదు. మొన్నటిదాకా టీఆర్ఎస్‌లో ఉన్నవారే అయినా… ఈటలను విడిచి మళ్లీ పార్టీలో తిరిగి చేరేందుకు వారు ససేమీరా అంటున్నారు. దళిత బంధు ఇస్తున్నారనే ఆశతో.. మొన్నటివరకు దళిత సామాజికవర్గానికి చెందిన కొందరు మనసు మార్చుకుని టీఆర్ఎస్ గూటికి చేరినా, ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు మాత్రం, ఎవరితో రాయబారం పంపినా, ఎంత పెద్ద ఆఫర్ ఇచ్చినా మొహం మీదే రాలేమని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో వారిని వెనక్కి రప్పించేందుకే పెద్ద షో చేయాల్సి వస్తోందట హరీష్‌రావు.
ఈటలను వీడి తిరిగి టీఆర్ఎస్‌లో చేరినవారికి.. భారీ మొత్తం చేతిలో పెట్టడంతో పాటు, పెద్ద సమావేశం ఏర్పాటు చేసి పార్టీలోకి ఆహ్వానించాల్సి వస్తోందట. చిన్న చిన్న లీడర్లు కూడా తాము పార్టీలోకి రావాలంటే కండిషన్లు పెడుతున్నారట. ఈటలను ఢీకొట్టాలంటే తప్పదు కాబట్టి.. వారు చెప్పినవాటికి తలూపాల్సి వస్తోందట హరీష్ రావు. ఈటల క్యాంప్ నుంచి ఎవరు బ్యాక్ వచ్చినా.. అదే పెద్ద అచీవ్‌మెంట్‌గా భావించాల్సి వస్తోందట ఆయనకి. ఇదిలా ఉంటే.. హరీష్ రావు సాటిస్‌ఫై చేసేందుకు మీడియేటర్లు.. ఆల్‌రెడీ టీఆర్ఎస్‌లో ఉన్నవారినే లేదా చేరిన వారే మళ్లీ మళ్లీ చేరుస్తూ.. మంత్రి వద్ద ప్రెస్టేజ్‌ని కాపాడుకునేందకు చాలా కష్టపడుతున్నారట పాపం.