తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేసే విషయంలో కేంద్రం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని మంత్రి హరీశ్ రావు తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే అందులో తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి కూడా కేటాయించలేదని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయని కేంద్రం, కేంద్ర మంత్రులచే అబద్దాలు చెప్పిస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎటువంటి విన్నపాలు రాలేదని ఒక మంత్రి చెబితే, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయని, అక్కడ మెడికల్ కాలేజీలు కావాలని కోరారని మరో మంత్రి చెప్పిన విషయాన్ని హరీశ్ రావు తప్పుబట్టారు.
సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో వ్యవహరించి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కాలేజీ పెట్టాలని నిర్ణయించుకున్నారని హరీశ్ రావు గుర్తుచేశారు. సొంత నిధులతో ఇప్పటికే 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని హరీశ్ రావు తెలిపారు. ప్రతి లక్ష జనాభాకు 19 మెడికల్ సీట్లు కలిగి ఉండేలా తెలంగాణలో మెడికల్ కాలేజీల స్థాపన జరిగిందని, ఇది దేశంలోనే అత్యధికమని మంత్రి గుర్తుచేశారు.
ఢిల్లీ ఎయిమ్స్ తో సరిసమానంగా అభివృద్ధి చెందాల్సిన బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధికి నిధులు కేటాయించని కేంద్ర ప్రభుత్వం అనేక తప్పుడు ప్రచారాలు చేస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. గుజరాత్ ఎయిమ్స్ కి 52 శాతం నిధులు కేటాయిస్తే, తెలంగాణ ఎయిమ్స్ కి కేవలం 11.4 శాతం నిధులను మాత్రమే కేటాయించారని హరీశ్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.