నాంపల్లి ఎగ్జిబిషన్ ద్వారా గొప్ప అనుభూతిని పొందవచ్చని మంత్రి హరీశ్ రావు అన్నారు. 82వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) 2023 ఈ రోజు ప్రారంభమైంది. ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్‌ను మంత్రి హరీశ్ రావు ఈ రోజు సాయంత్రం 5గంటలకు ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… నుమాయిష్‌కు గొప్ప ప్రజాదరణ ఉందన్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా గొప్ప అనుభూతిని పొందవచ్చని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా 19 విద్యా సంస్థలు నడుస్తున్నాయని వివరించారు. సుమారు 10వేల మందికి సొసైటీ ద్వారా లబ్ధి కలుగుతుందన్నారు.
ఈ నుమాయిష్ 45 రోజుల పాటు కొనసాగనున్నది. నుమాయిష్‌ను మొదటగా 1938లో ప్రారంభించారు. మొదట వంద స్టాల్స్ ఉండేవి. ప్రస్తుతం 1500కుపైగా స్టాల్స్ ఉన్నాయి. ఎగ్జిబిషన్ ప్రారంభంలోనే 60శాతం స్టాల్స్ నిండిపోయాయని చెప్పారు. ఇక్కడ అన్ని రకాల సాంస్కృతిక సంప్రదాయాలు దర్శనమిస్తాయని వివరించారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎంతో మంది వ్యాపారులు నుమాయిష్ కు వస్తారన్నారు. ఈ సొసైటీ ద్వారా 30వేల మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని వెల్లడించారు. ఈ సొసైటీ మహిళల చదువుకు పెద్దపీట వేస్తోందన్నారు. సొసైటీలో చదివిన వారిలో చాలా మంది ఉన్నతస్థానాల్లో ఉన్నారని చెప్పారు.