ఎన్నికలొస్తున్నాయంటే చాలు టీఆర్ఎస్ నేతలకు నిరుద్యోగులు గుర్తుకొస్తారు… అదిగో నోటిఫికేషన్ అంటూ ఊరించి ఎన్నికలయ్యాక మర్చిపోతారన్న విమర్శలున్నాయి. గత డిసెంబర్ నుండి త్వరలో 50వేల ఉద్యోగాలంటూ కేసీఆర్ సర్కార్ ఊరిస్తూనే ఉంది. కానీ ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ మాత్రం రాలేదు.
కేసీఆర్… కేటీఆర్… హరీష్ రావు… ఇలా నాయకులంతా త్వరలో 50వేల ఉద్యోగాలంటూ ఊదరగొట్టిన వారే. తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు హరీష్ రావు మరోసారి ఉద్యోగ నోటిఫికేషన్లు, ఖాళీల సంఖ్యను తెరపైకి తెచ్చారు. ఉద్యోగ ఖాళీలు 60వేలున్నాయని… నోటిఫికేషన్లు వస్తాయంటూ ఆర్థికమంత్రిగా హరీష్ రావు ప్రకటించారు. అంతేకాదు ప్రైవేటు టీచర్లకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని కూడా పనిలో పనిగా హామీల వర్షం కురిపించారు.
హరీష్ రావు తాజా ప్రకటనపై నిరుద్యోగ యువత మండిపడుతుంది. జనం నమ్ముతారా అని కూడా ఆలోచించకుండా పట్టపగలే సిగ్గులేకుండా హమీలిస్తున్నారని… త్వరలో 50వేల పోస్టులన్న నాయకులు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని మండిపడుతున్నారు. నిరుద్యోగ యువతను మోసం చేస్తూ కాలం గడుపుతున్న టీఆర్ఎస్ సర్కార్ కు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లు మీ మాయ మాటలు నమ్మామని, ఇక మోస పోయేందుకు సిద్ధంగా లేమని హెచ్చరిస్తున్నారు.