కరోనా పరిస్థితులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మంత్రి హరీష్ రావు స్పందించారు. ఒమైక్రాన్ కట్టడి విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని తెలిపారు. ఎయిర్ పోర్ట్ లో విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ టెస్ట్ చేస్తామని.. కేంద్రం బూస్టర్ డోస్, చిన్న పిల్లల వ్యాక్సినేషన్ పై స్పందించడం లేదని విమర్శించారు. ఇతర దేశాలు బూస్టర్ డోస్ ఇవ్వాలని చెబుతున్నా కేంద్రం మాత్రం మౌనంగా ఉంటోందని మండిపడ్డారు.
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. పండగలు, వేడుకల్లో జనం గుమిగూడకుండా చూడాలని తెలిపింది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఒమిక్రాన్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలన్న హైకోర్టు.. రాష్ట్రాల సరిహద్దుల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. ఢిల్లీ, మహారాష్ట్ర తరహా నిబంధనలు పరిశీలించాలని సూచించింది. ప్రజలు ఒకచోటకు చేరకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది. రెండు రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయలని ఆదేశించింది. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పనిలోపనిగా కేంద్రంపై విమర్శలు చేశారు.