మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మరోసారి టార్గెట్ చేశారా…? ఎంతో కాలంగా ఉన్న వైరం మరోసారి మొదలైందా…? కలిసినట్లే కలిసిపోయిన ఆ ఇద్దరు నేతలు ఎందుకు కత్తులు దూసుకుంటున్నారు…?
మంత్రి హరీష్‌రావుకు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఉన్న వైరం అందరికీ తెలుసు. 2004లో జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్ గూటికి చేరుకున్నప్పటి నుండి వీరి ఇరువురి మధ్య వైరం ఉంది. 2014 ఎన్నికల్లో జగ్గారెడ్డిని పట్టుబట్టి ఓడించారని ఆయన వర్గీయులు హరీష్‌పై కోపంతో ఊగిపోయేవారు. కానీ 2018 ఎన్నికల్లో హరీష్‌ను తట్టుకొని మరీ జగ్గారెడ్డి జయకేతనం ఎగురవేశారు.
కానీ అనూహ్యంగా సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను పొగుడుతూ హరీష్‌ను టార్గెట్ చేసిన జగ్గారెడ్డి… సంగారెడ్డిని నీళ్లను దోచికెళ్లిన దొంగ హరీష్ అని విమర్శలు చేశారు. సింగూరును ఎండబెట్టింది హరీష్ రావేనంటూ సంచలన ఆరోపణలు చేసినా, జగ్గారెడ్డి ఓ మెట్టుదిగి మరీ హరీష్‌తో సయోధ్య చేసుకోవటం… సంగారెడ్డి పర్యటనలో హరీష్‌కు స్మనానం చేయటం జరగటంతో వైరం ముగిసిందని అంతా అనుకున్నారు.
కానీ, ఇప్పుడు జగ్గారెడ్డిని హరీష్ మరోసారి టార్గెట్ చేశారు. అతి త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. సంగారెడ్డి సహా ఆ నియోజకవర్గంలో ఉన్న ఐదు మున్సిపాలిటీలను ఎగుర వేసి 2018 ఓటమి నుండి భయటపడాలని హరీష్ పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఈ మధ్య హరీష్ సంగారెడ్డి టార్గెట్‌గా పనిచేస్తున్నారని తెలుస్తోంది. హరీష్ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో తృటిలో ఓడిపోయాం… ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో ఆ చాన్స్ ఇవ్వొద్దు, గులాబీ జెండా ఎగురెద్దాం అంటూ కార్యకర్తలను ఉత్సాహా పరుస్తున్నారు.
మరోవైపు హరీష్‌ను కట్టడి చేసి, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం జగ్గారెడ్డి కూడా ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేస్తుండటంతో… వీరిద్దరి మధ్య మరోసారి వైరం మొదలైనట్లే అంటున్నాయి సంగారెడ్డి రాజకీయ వర్గాలు.