వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరడమంటే తమ గోతిని తామే తవ్వుకోవడమేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ఈ నెల 18 న నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై ఆయన సన్నాహక సమావేశాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఇల్లందు నియోజకవర్గంలో పర్యటనలో ఆయన మాట్లాడుతూ… ఖమ్మం జిల్లాలో బీజేపీకి స్థానం లేదన్నారు. జిల్లాలో మతతత్వ పార్టీలకు డిపాజిట్లు కూడా రావని ఆయన అన్నారు. ఎవరైనా బీజేపీ గురించి ఆలోచన చేస్తే అది తాము తవ్వుకున్న గోతిలో తాము పడటమే అవుతుందన్నారు.
బీజేపీలోకి వెళ్తే రాజకీయాలకు దూరమైనట్టేనని పేర్కొన్నారు. సింగరేణిని అమ్ముతున్న బీజేపీకి ఇల్లందు గడ్డపై ఎవరూ మద్దతు ఇవ్వబోరని చెప్పారు. సింగరేణిని కాపాడుకోవాలంటే ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వొద్దన్నారు. బీజేపీకో హఠావో సింగరేణి కో బచావో అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు.
బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన అమిత్ షాతో భేటీ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పొంగులేటిని ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యలు చేశారని పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది.