సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాదాద్రి ఆలయ పునఃప్రారంభం పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహాద్భుత ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా రూపు దిద్దుకున్న యాదాద్రి ఆలయ పునఃప్రారంభ తేదీని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆలయ పనుల పురోగతి, మహా సుదర్శన యాగం, మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై అరణ్య భవన్ లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
యాదాద్రి ఆలయ ప్రాంగణంతో పాటు టెంపుల్ టౌన్, కాటేజీ ల నిర్మాణాలు, లైటింగ్ ఏర్పాట్లు, కళ్యాణ కట్ట, దీక్షాపరుల మండపం, అన్న ప్రసాదం, వ్రత మండపం, గండి చెరువు సుందరీకరణ, బస్ టర్మినల్స్ తదితర నిర్మాణాల పురోగతిపై అధికారులతో మంత్రి చర్చించారు. మార్చి 21న నిర్వహించే సంప్రోక్షణకు అంకురార్పణ-మహా సుదర్శన యాగం.. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాల ఏర్పాట్లతో పాటు.. యాగశాలల నిర్మాణం, రుత్వికులకు బస చేసేందుకు విడిది, తదితర ఏర్పాట్లపై ఆరా తీశారు. గడువులోగా ఆలయ పునర్నిర్మాణ, విస్తరణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనుల తీరుపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించుకుంటూ.. సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు.
సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో ఈ పుణ్యక్షేత్రాన్ని సకల హంగులతో దేదీప్యమానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు ఇంద్రకరణ్ రెడ్డి. విమాన గోపురం బంగారు తాపడానికి విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఎన్ఆర్ఐ దాతల నుంచి సేకరించిన నిధులతో ఆలయంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.