సీఎం కేసీఆర్ ను ముట్టుకుంటే కాలిపోతారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మిలటరీ ఉందని కేసీఆర్ ను పట్టుకుపోతారా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి సొంతూరికి పోయినా కేసీఆర్ పాలన గురించి.. బీజేపీ చేసిన నష్టంపై ప్రజలు చెప్తారని అన్నారు. కిషన్ రెడ్డి.. నీతో చర్చలకు కేసీఆర్ రావాలా అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు మంత్రి.
కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఏమైనా నిధులు తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. మిషన్ కాకతీయ అద్బుతమైన పథకమని నీతి ఆయోగ్ ప్రశంసించిన విషయాన్ని మరిచిపోయారా అని అన్నారు. ఈ పథకానికి నిధులు ఇవ్వాలని కూడా నీతి ఆయోగ్ సిఫారసులు చేసిందని గుర్తు చేశారు.
కానీ.. కేంద్రం ఇంత వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రాల హక్కుల గురించి బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అవమానం గురించి బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.
విద్యుత్ సంస్కరణలను దొడ్డిదారిన అమలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. విద్యుత్ చట్టం తీసుకు రాకుండా పాలసీ విధానంగా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. చట్టం చేస్తే రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయని భావించి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వ్యవసాయ మీటర్లకు మోటార్లు పెట్టాలని కేంద్ర చెప్తోందని జగదీష్ రెడ్డి అన్నారు.