పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర కన్నులపండుగగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంగరంగ వైభవంగా పెద్దగట్టు జాతరను ప్రారంభించుకున్నామని.. లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారని అన్నారు. కేసీఆర్ యజ్ఞంతో ఎడారిగా మారిన సూర్యాపేట సస్యశ్యామలం అయ్యిందని అన్నారు. కాళేశ్వరం మొదటి ప్రతిఫలం అందుకున్న ప్రాంతం సూర్యాపేట అని చెప్పారు.
కాలం కలిసొచ్చి పాడి పంటలు బాగా పండాలని లింగమంతుల స్వామిని కోరుకున్నానన్నారు. కాళేశ్వరం జలాలతో లింగమంతుల స్వామి పాదాలు కడిగే భాగ్యం కేసీఆర్ కే దక్కిందన్నారు. తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధికి నిదర్శనంగా జాతర కోలాహలం కనిపిస్తోందని తెలిపారు. మళ్ళీ జాతర నాటికి తెలంగాణ మరింత అభివృద్ధి చెంది ముందుకు సాగాలని ఆకాంక్షించారు మంత్రి జగదీష్ రెడ్డి.
మరోవైపు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఓ లింగా.. ఓలింగా అన్న నామస్మరణతో పెద్దగుట్ట మారుమ్రోగుతోంది. రాత్రి నుంచి గుడి చుట్టూ భక్తులు మందగంపల ప్రదర్శన చేశారు. ఈరోజు భక్తులు బోనాలు సమర్పించి గొర్రెలు, మేకలు బలి ఇచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈనెల 5 నుంచి 9 వరకు జాతర జరగనుంది.
జాతర సందర్భంగా మొత్తం 1850 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. 60 సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో నిఘా ఏర్పాటు చేశారు అధికారులు. 5 వ తేదీ నుంచి హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను మళ్లించారు. హైదరాబాద్ – విజయవాడ వైపు వెళ్లే వాహనాలు టేకుమట్ల వద్ద ఉన్న ఖమ్మం వైపు వెళ్లే 365 బీబీ బైపాస్ మీదుగా నామవరం, గుంజలూరు స్టేజ్ నుంచి కోదాడ వైపు మళ్లించారు. జాతర సందర్భంగా ఈరోజు సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వ అధికారులు సెలవు ప్రకటించారు.