నల్గొండ జిల్లాలో నూతనంగా ఏర్పడిన గట్టుప్పల్ లో తహసీల్దార్ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్ ను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే ఈ మండలాన్ని ఏర్పాటు చేశామన్నారు.
అంతేకాకుండా ఈ ప్రాంత ప్రజలకు 37 ఏళ్ల నిరీక్షణకు ఫలితం లభించినట్లయ్యిందని ఆయన పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా అర్థం లేనిదని అన్నారు. బహిరంగ మార్కెట్ లో 22 వేల కోట్లకు అమ్ముడు పోయిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని ధ్వజమెత్తారు.
ఇప్పటి వరకు కేంద్రం నుంచి మునుగోడుకు పైసా కూడా రాలేదని తెలిపారు. ద్రోహం, స్వార్థం తప్పా రాజగోపాల్ రెడ్డికి అభివృద్ధి చేయాలనే ఆలోచనే లేదు అని విమర్శించారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అమలవుతున్నాయా అంటూ ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోటార్ లకు మీటర్లు పెట్టి రైతుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు.
ప్రజల జేబులకు చిల్లులు పెట్టడమే బీజేపీ లక్ష్యమన్నారు. బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు రావడం ఖాయం అని పేర్కొన్నారు. టీఆర్ ఎస్ కు ఓటేస్తే ఇంటింటికీ తాగు నీరు, ప్రతి ఎకరానికి సాగు నీరు పారుతోందన్నారు. సంక్షేమం కావాలో ? సంక్షోభం కావాలో? మునుగోడు ప్రజలు తేల్చుకోవాలి అని సూచించారు.
దేశమంతా తెలంగాణ మాదిరిగా కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు.