పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు అందరికీ నాణ్యమైన వైద్య సేవలను అందించేలా వైద్య రంగంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసూతి వైద్యాన్ని అందించేలా సర్కార్ చర్యలు తీసుకుంటోందన్నారు.
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యల వల్ల ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం పెరిగిందన్నారు. భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…గతంలో సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో మంచి నీళ్లు కూడా సరిగ్గా దొరకలేదన్నారు.
దీనివల్ల తెలంగాణలో చాలా మంది కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారని ఆయన చెప్పారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ఉచితంగా డయాలసిస్ సేవలను అందించేందుకుగాను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 9 కేంద్రాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా మెడికల్ హబ్‌గా మారిందని ఆయన వెల్లడించారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు చేయడంతో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతోందన్నారు.