హైదరాబాద్ కు ఎంతో మంది పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు.. పోతుంటారని అన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. వచ్చిన వాళ్లు దమ్ బిర్యాని తిని వెళ్లడమే తప్ప.. ఎన్నికల్లో గెలిచేది లేదని ఎద్దేవా చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీలో కైటెక్స్ టెక్స్ టైల్ పార్కుకు మంత్రి కేటీఆర్ భూమిపూజ నిర్వహించారు.
ఆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమయ్యిందన్నారు. మెగా టెక్స్‌టైల్ పార్కులో ఏర్పాటు చేసిన కీలక కంపెనీల కోసం సీఎం కేసీఆర్ తో పాటు.. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో కృషి చేశారని కేటీఆర్ వెల్లడించారు.
దాదాపు రూ.12 వేల కోట్ల వ్యయంతో 187 ఎకరాల్లో కైటెక్స్ వస్త్ర పరిశ్రమ యూనిట్ ను ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 12 వేల మందికి ఉపాధి లభించనుందని.. ఇందులో 8వేల మంది వరకు మహిళలకే అవకాశం ఇవ్వనున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కైటెక్స్ మెగా జౌళి పార్కుకు 100 కోట్ల రూపాయల వ్యయంతో చలివాగు నుంచి నీరు అందించే మిషన్ భగీరథ పైపులైను.. వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం గణేశ్ ఎకోపెట్ టెక్స్ టైల్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. కాకతీయ మెగా జౌళి పార్కులో 400 కోట్ల రూపాయలతో గణేశ్ ఎకోపెట్ పరిశ్రమ ఏర్పాటు చేశారు. 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో 700 మంది ఉపాధి పొందనున్నారని అన్నారు. దీనికి దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనీ.. కేటీఆర్ సమక్షంలో తమ పరిశ్రమకు సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.