హైదరాబాద్‌లో మెట్రో రైలును విస్తరించే విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మొత్తం 69 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించనున్నట్టు శాసన మండలిలో ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతకు ముందు మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు, నాగోల్ నుంచి ఎయిర్ పోర్టు వరకు పొడగించాలంటూ ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం కోరారు.
ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణకు అవకాశాలు ఉన్నాయా అంటూ మరో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ అడిగారు. మెట్రో ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తోందా అని ఆయన ప్రశ్నించారు. వీటిపై స్పందిస్తూ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
నగరంలో మొత్తం 69 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించి ఉందన్నారు. గతంలో మెట్రో మొత్తం పీపీపీతో నడిచిందని ఆయన వివరించారు. ప్రస్తుతం మెట్రో రైలును రహేజ ఐటీ పార్కు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు విస్తరిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
ఇది రాష్ట్ర సర్కార్ చేపడుతున్న ప్రాజెక్ట్ అని ఆయన తెలిపారు. కరోనా తర్వాత చాలా మంది రవాణా కష్టాలు పడ్డారని ఆయన చెప్పారు. ఎయిర్ పోర్టు మెట్రలో ఎవరైనా ప్రయాణం చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. లక్డీకపూల్ నుంచి బీహెచ్ఈఎల్ మెట్రో మూడో దశ కూడా త్వరలో చేపడుతామని చెప్పారు.
మరోవైపు ఈ బడ్జెట్‌లో ఓల్డ్ సిటీకి మెట్రోకు నిధులు కేటాయించామన్నారు. తెలంగాణపై కేంద్రం కనీసం కనికరం కూడా చూపించడం లేదన్నారు. ముంబై, గుజరాత్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో మెట్రోకు నిధులు ఇచ్చారని ఆయన అన్నారు. కానీ తెలంగాణకు మాత్రం కేంద్రం పైసా కూడా నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
కేంద్రం నుంచి సహాయం అందినా, అందకున్నా రాష్ట్ర అభివృద్ధి కోసం తాము ముందుకు వెళ్తామన్నారు. ఛార్జీలు పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. తమకు చెప్పకుండా ఛార్జీలు పెంచొద్దని ఇప్పటికే మెట్రో అధికారులకు సూచించామన్నారు.