కాళేశ్వరం, మిషన్ భగీరథ తరహాలోనే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను కూడా సీఎం కేసీఆర్ నాయకత్వంలో పూర్తి చేస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ ప్రాజెక్టుల వల్ల మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. రంగారెడ్డి జిల్లా చందన్ వెల్లి పారిశ్రామిక వాడలో వెల్ స్పన్ అడ్వాన్స్ డ్ మెటీరియల్ లిమిటెడ్ యూనిట్ ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రజా ప్రతినిధులు, వెల్ స్పన్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో పూర్తి చేసిందన్నారు. దురదృష్టవశాత్తూ కొన్ని కారణాలతో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయన్నారు.
ఐదేళ్ల కింద చందన్ వెల్లిలో ఒక్క పరిశ్రమ కూడా లేదని, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం అతిపెద్ద పారిశ్రామిక సమూహంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్ నుంచి వచ్చి వెల్ స్పన్ ఇక్కడ భారీ పెట్టుబడి పెట్టింది.
వెల్ స్పన్ సంస్థ వచ్చే ఐదేళ్లలో రూ.5 వేల కోట్ల పెట్టుబడికి సిద్ధమైందన్నారు. వెల్ స్పన్ స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటోంది. ఈ సందర్భంగా వెల్ స్పన్ కంపెనీ బాలకృష్ణ గోయెంకాకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కేటీఆర్.