తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తుక్కుగూడ సభలో అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణలో అసమర్థ ప్రభుత్వం ఉందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి అమిత్ షా వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గుజరాత్ సీఎంగా మోడీ మూడుసార్లు గెలిచారని, అక్కడ నేటికి తాగునీటికి ఇబ్బందులున్నాయని.. ఎవరు అసమర్థుడు? ఎవడు దద్దమ్మ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో రాజకీయ పర్యాటకుల సందడి నడుస్తోందని కేటీఆర్ సెటైర్లు వేశారు. గాలి మోటర్లో వచ్చి.. గాలి మాటలు చెప్పడం ఆనవాయితీగా మారిపోయిందని మండిపడ్డారు.
తుక్కుగూడలో చేసిన తుక్కు డిక్లరేషన్‌ని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా ప్రసంగం అంతా అబద్దాలేనని, అమిత్ షా కాదు.. అబద్దాల బాద్‌షా అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణకు మీరు ఏం చేశారో చెప్పాలని కోరామని.. 25 ప్రశ్నలతో అమిత్ షాకు లేఖ కూడా రాశానన్నారు. నిజం చెప్పండి అమిత్ షా గారూ అంటే.. నిజాం గురించి చెప్పారని దుయ్యబట్టారు.
స్థానిక పరిస్థితులపై అవగాహన లేకుండా.. ఇక్కడికి వచ్చి.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు కామన్ సెన్స్ లేకుండా ఒకొక్కరు ఒక్కోమాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 8 ఏళ్లలో బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. బట్టేబాజ్ మాటలు చెప్పి బట్టకాల్చి మీదేస్తామంటే ఊరుకోబోమని కేటీఆర్ హెచ్చరించారు.
తెలంగాణ 3 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ చెల్లిస్తే.. తిరిగి ఇచ్చింది లక్షా 68 వేల కోట్లేనని తెలిపారు. బీజేపీ వాళ్లది అబద్దాల బతుకని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన డబ్బుతో బీజేపీ రాష్ట్రాలు బతకట్లేదా..? ధోకేబాజ్ మాటలు మాట్లాడి వెళ్లిపోతే కుదరదు.. అని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పెట్రో రేట్లు పెంచి రూ.26 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారని మండిపడ్డారు. మేం స్టార్టప్ అంటున్నాం వాళ్లు ప్యాకప్ అంటున్నారని ఎద్దేవా చేశారు.
అలాగే, ఇంత అవినీతి ప్రభుత్వాన్ని దేశంలోనే చూడలేదని అమిత్ షా వ్యాఖ్యానించడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. సీఎం పీఠం కోసం కేంద్ర అధిష్టానం రూ. 2500 కోట్లు అడిగినట్లు కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక కేంద్రంలో 8.75లక్షల ఖాళీలున్నాయని స్వయంగా కేంద్రమంత్రి చెప్పారని, అక్కడన్ని ఖాళీలు పెట్టుకుని.. ఇక్కడ నియమకాల గురించి మాట్లాడతారా.. అంటూ విరుచుకపడ్డారు. బీజేపీకి ఓ నాయకుడు లేడు, ఓ చరిత్రలేదని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు.