బీజేపీపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సెస్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం సందర్భంగా వినియోగదారులు, రైతులతో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ని ఓ ఆడుకున్నారు. ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను, బీజేపీ నేతల హామీలను ప్రశ్నిస్తూ విరుచుకుపడ్డారు. సెస్ ఎన్నికల్లో బండి సంజయ్ రూ.5 కోట్లు పంచారని ఆరోపించారు కేటీఆర్. అభ్యర్థులు ఫోన్లు చేసి తనకు ఈ విషయం చెప్పారని అన్నారు.
సెస్ ఎన్నిక ట్రైలర్ మాత్రమేనని.. 2023లో అసలు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. అయినా.. ఈ ఎన్నికలోనే గెలవలేని వాళ్లు రాష్ట్రంలో గెలుస్తారా అని ఎద్దేవ చేశారు. చేనేతపై పన్ను వేసిన ప్రధాని దేవుడెలా అవుతారని ప్రశ్నించారు. గుజరాత్ నాయకుల చెప్పులు మోయడమే మీ పని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. దమ్ముంటే తమకంటే ఎక్కువగా మంచి పనులు చేసి ప్రజల మనసులను గెలవాలని హితవు పలికారు.
రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లింది ఎంత.. తిరిగి తెలంగాణకు ఇచ్చిందెంత అని ప్రశ్నించారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మరోసారి సవాల్ విసిరారు. ట్రిపుల్ ఐటీ, నవోదయ పాఠశాలలు బండి తీసుకొచ్చారా? అంటూ నిలదీశారు. రాజరాజేశ్వర స్వామికి రూ.10 చందా అయినా రాయించారా? అంటూ ధ్వజమెత్తారు. ఈసారి సిరిసిల్ల నుంచి విజయయాత్ర ప్రారంభించి.. కరీంనగర్ పార్లమెంట్ పై గులాబీ జెండాను ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.
సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో దేశం మొత్తంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు కేటీఆర్. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ను సరఫరా చేయాలని, సెస్ పరిధిలో ప్రత్యేక విద్యుత్ ప్రణాళిక రూపొందించాలని.. దానికోసం ఎన్ని నిధులైనా ఇప్పిస్తామని తెలిపారు.