– బండి, రేవంత్ ఎప్పుడైనా పరీక్షలు రాశారా?
– రాస్తే తెలిసేది.. ఎలా నిర్వహిస్తారో.. ఎవరు నిర్వహిస్తారో!
– గుజరాత్ లో 13 పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి?
– వీళ్లంతా అప్పుడేం చేశారు?
– దేశాన్ని మోడీ మిత్రులకు దోచి పెడుతోంది నిజం కాదా?
– కేసీఆర్ ను అనరాని మాటలంటున్నారు
– మాకు మాట్లాడడం రాదా?
– ప్రధానిని బ్రోకర్ అనగలను.. కానీ, సంస్కారం అడ్డొస్తోంది..
– ప్రతిపక్షాలపై కేటీఆర్ గరం గరం
టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారంపై మరోసారి స్పదించారు మంత్రి కేటీఆర్. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. వ్యక్తి తప్పిదం వల్ల జరిగిన టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
అసలు, జీవితంలో ఎప్పుడైనా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పోటీ పరీక్షలు రాశారా? అని అడిగారు కేటీఆర్. అలాంటి పరీక్షలు ఎప్పుడైనా రాసి ఉంటే అవి ఎలా నిర్వహిస్తారు, ఎవరు నిర్వహిస్తారు అనే విషయాలు తెలిసి ఉండేవని ఎద్దేవ చేశారు. గుజరాత్ లో 13 పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీకయ్యాయని, అప్పుడు ఏం చేశారని మండిపడ్డారు. ఎనిమిదేళ్లుగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసుకుంటూ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు కేంద్రం అమ్ముతోందని ఆరోపించారు. దేశాన్ని తన దోస్తులకు ప్రధాని మోడీ దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఒక శత్రువుగా చూస్తోందని ఆరోపించారు కేటీఆర్. దేశంలో ఏ ప్రభుత్వం చేయనంతగా తెలంగాణ ప్రభుత్వం చేస్తోందన్న ఆయన.. ఒకవైపు అవార్డులు ఇస్తూనే మరోవైపు రూ.12 వందల కోట్లు నిధులు విడుదల చేయకుండా వేధిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, మరిన్ని అవార్డులు దక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.
కేంద్రం వివక్ష చూపినా తాము రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నామని తెలిపారు కేటీఆర్. సిరిసిల్లకు మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరూ అనుకోలేదని, కరువుమెట్ట పంటలు ఉన్న సిరిసిల్ల కోనసీమలాగా మారిందన్నారు. ఇలాంటి అసాధ్యమైన పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సాధ్యం అవుతున్నాయని చెప్పారు. దీనిని ప్రజలంతా గుర్తుంచుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను అనరాని మాటలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కూడా మాటలు వచ్చని, తాము కూడా ప్రధానిని బ్రోకర్ అనగలుగుతామన్నారు. కానీ, తమకు సంస్కారం ఉందని, అనలేమని ఎద్దేవ చేశారు.
ఎంపీగా గెలిచినప్పటి నుంచి కరీంనగర్ కు ఏం చేశారో బండి సంజయ్ ను నిలదీయండి అని పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు లేవని అన్నారు. కేంద్రానికి మనతో రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ అవార్డులు ఇవ్వక తప్పట్లేదని కామెంట్ చేశారు. తెలంగాణలోని గ్రామాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అభివృద్ది చెందుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు బెస్ట్ గ్రామాలు ఎక్కడున్నాయంటే కేరళలో ఉన్నాయని చెప్పారు.. కానీ, నేడు ఐఏఎస్ అధికారులకు పాఠాలు చెప్పే స్థాయికి మన గ్రామాలు చేరుకుంటున్నాయని తెలిపారు కేటీఆర్.