మునుగోడు ఉప ఎన్నికల వేడి రోజురోజుకి పెరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తరువాతే టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఈరోజు టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కేటీఆర్ ప్రసంగించారు.
ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. చేనేత మీద పన్ను విధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి, దుర్మార్గపు ప్రధాన మంత్రి మోడీనే అంటూ విరుచుకుపడ్డారు.
చేనేతకు మరణశాసనం రాసింది మోడీనే అని విమర్శించారు. ఆయన కంటే ముందున్న 14 మంది ప్రధానమంత్రులు చేయని దుర్మార్గాన్ని చేసి, చేనేతకు మరణ శాసనం రాశారు. ఈ రోజు చేనేత మీద 5 శాతం జీఎస్టీ విధించారు. చేనేత బంద్ అయిపోయే రోజును మోడీ తీసుకొస్తారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేశాడు. నేతన్నకు ఇచ్చే బీమా పథకాన్ని ఎత్తేశాడు.
కేసీఆర్ మాత్రం చేనేత మిత్ర పేరుతో 40 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ఎన్నికలు రాగానే ఆగమాగం మాటలు చెబుతున్నారంటూ విరుచుకుపడ్డారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే.. ఈ నియోజకవర్గానికి రూ. 1000 కోట్లు ఇస్తానని అమిత్ షా చెప్పాడని అని రాజగోపాల్ రెడ్డి మాట్లాడున్నాడు అంటూ పేర్కొన్నారు.
ఉప ఎన్నిక వచ్చిన చోటల్లా ఇదే మాట చెబుతారు. ఒక్క పైసా కూడా ఇవ్వడంలేదు. పచ్చి మోసగాళ్లు బీజేపీ నాయకులంటూ విరుచుకుపడ్డారు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారన్నారు. రైతన్న, గీతన్న, నేతన్న కోసం పని చేసే నాయకుడిని గెలిపించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.
సాగునీటి ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చడం లేదు. 811 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమకు రావాల్సిన 575 టీఎంసీలు ఇవ్వాలని కోరాం. కానీ స్పందన లేదు. నీళ్లలో వాటా తేల్చకుండా చావగొడుతున్నారు. కేసీఆర్‌కు మంచి పేరు రాకుండా మోడీ ఆగం చేస్తున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు.