బీజేపీపై కేటీఆర్ ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. తాజాగా ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. “బీఎస్ కుమార్ మీరు హాస్యాస్పదమైన, నిరాధారమైన, బాధ్యతారహితమైన ఆరోపణలు ఆపాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది” అని వార్నింగ్ ఇచ్చారు.
ఇంటర్ విద్యార్థులకు సంబంధించి బండి చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు కేసీఆర్. సాక్ష్యం ఉంటే దానిని పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని.. లేకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 28వ రోజు ఓ గ్రామంలో రచ్చబండ నిర్వహించారు బండి. ఈ సందర్భంగా ఇంటర్ పరీక్షల ఫలితాలపై మాట్లాడారు. పరీక్షల్లో ఫెయిల్ చేసిన కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కేటీఆర్ నిర్వాకం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు.
చనిపోయిన విద్యార్థుల గురించి కనీసం ప్రభుత్వం స్పందించలేదని అన్నారు బండి. అలాగే ఆర్టీసీ కార్మికుల విషయంలోనూ ఇలాగే ప్రవర్తించిందని ఫైరయ్యారు. పెద్దోళ్లు చినిపోతేనే కేసీఆర్ స్పందిస్తారని.. పేదోళ్లపై కాస్త కూడా కనికరం చూపరని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ స్పందించారు. అర్థంపర్థం లేని ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.