బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని ఆయన అన్నారు. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం చాలా పరిమితమన్నారు. కనీసం ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్ మహా అజ్ఞాని అని తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ వ్యవస్ధల పనితీరు, వాటి పరిధుల గురించి కనీసం అవగాహన లేకుండా బండి సంజయ్ ఎంపీ ఎలా అయ్యాడో తనకు అర్థం కావడం లేదన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, సమర్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణిపై కూడా అర్థరహిత ఆరోపణలు చేస్తున్నాడన్నారు. అది బండి సంజయ్ దగుల్బాజీ రాజకీయాలకు నిరద్శనమని దుయ్యబట్టారు.
బోడి గుండుకు, మోకాలికి ముడిపెట్టినట్టు ధరణి పోర్టల్, టీఎస్పీఎస్సీ అంశంతో ముడిపెట్టి తనపై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోనన్నారు. గతంలోనూ ఇంటర్ పరీక్షలపై నిరాధారమైన ఆరోపణలు చేసి ఆయన ఇప్పుడు పరువునష్టం కేసు ఎదుర్కోంటున్నారన్నారని చెప్పారు. అయినప్పటికీ అతనికి బుద్ధి రాలేదని మండిపడ్డారు.
రాజకీయ దురుద్దేశంతో బండి సంజయ్ చేస్తున్న ఈ కుట్రలకు రాబోయే రోజుల్లో క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరుసగా ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రశ్నాపత్రాలు లీకైన సందర్భాలు వందల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
ఆ లీకేజీల్లో స్వయంగా బీజేపీ నేతలే ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు తేలిందన్నారు. ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్‌లోనే 8 ఏళ్లలో 13 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయన్నారు. మరి కుంభకోణాలపై ఏమంటావని బండి సంజయ్‌కు ప్రశ్నలు సంధించారు.
ఈ లీకేజ్‌లపై ప్రధాని మోడీని బాధ్యున్ని చేసి, ఆయన రాజీనామాను డిమాండ్ చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్వశ్చన్ పేపర్లు లీకైతే తిరిగి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయని చెప్పారు. అక్కడ పేపర్లు లీకైన సమయంలో మంత్రిని కానీ, సీఎంని కానీ బీజేపీ ఏనాడూ బాధ్యులను చేయలేదన్నారు. బీజేపీ నాయకులే కీలక సూత్రధారులుగా ఉన్న మధ్యప్రదేశ్ వ్యాపం ఉద్యోగాల కుంభకోణంలో బీజేపీ ఎలా వ్యవహరించిందో దేశం మొత్తానికి తెలుసన్నారు.
బీజేపీ ప్రభుత్వాల హయాంలో జరిగితే ఒకలాగా, ఇతర పార్టీలు ప్రాతినిథ్యం వహించే రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలపై నిందలు వేస్తూ మరోలా వ్యవహరిస్తున్నారన్నారు. అది బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ కు నిదర్శనమంటూ ఆయన విరుచుకుపడ్డారు.
ఎప్పుడైనా ఎక్కడైనా లోపం జరిగితే అప్పుడు ప్రభుత్వం వెంటనే ఎంత వేగంగా స్పందించి, ఎలాంటి చర్యలు తీసుకుందనేదే ముఖ్యమన్నారు. ఆ విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రం వెలుగులోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మెరుపువేగంతో సిట్‌ను నియమించిందన్నారు. బాధ్యులను గుర్తించి వారందరినీ అరెస్టు చేసిందన్నారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దుచేయాలని కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు.
ప్రభుత్వం స్పందించిన పారదర్శక తీరును పట్టించుకోవడం లేదని, మొత్తం వ్యవహారాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గమైన ప్రయత్నాన్ని మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. తమ స్వార్ధ రాజకీయాలకు సమాజంలో చిచ్చుపెట్టే అలవాటు బీజేపీకి కొత్త కాదని, ఈ వ్యవహారాన్ని సైతం శాంతి భద్రతల సమస్యగా మార్చే కుట్ర చేస్తోందని అన్నారు.