– మోడీది దుర్మార్గమైన పాలన
– విమర్శలు చేయండి కానీ.. రాష్ట్రాన్ని కించపరచొద్దు
– కేసీఆర్ అంటే మెచ్చని నేత లేరు
– విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్ లో ఉన్నాం
– తెలంగాణ పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి
– అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రసంగం
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో కేటీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. రోజుకు మూడు డ్రెస్ లు మార్చడం కాదు.. ఓ విజన్ ప్రకారం నాయకులు పని చేయాలని ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడారు. దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తోందని.. కేసీఆర్ అంటే మెచ్చని నేత, ఆర్థిక వేత్త లేరని కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో రైతు వ్యతిరేక నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలు తీశారని.. ఇంత దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలోనే ఎక్కడా లేరని ఫైరయ్యారు కేటీఆర్. తాము రైతురాజ్యం అంటే.. బీజేపీ వాళ్లు కార్పొరేట్ రాజ్యం అంటున్నారని మండిపడ్డారు. విమర్శలు చేయండి కానీ.. రాష్ట్రాన్ని కించపర్చొద్దని హితవు పలికారు. రైతుబంధుని యూఎన్‌వో కూడా ప్రశంసించదని.. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్‌గా ఉన్నామని తెలిపారు.
బీఆర్ఎస్ నినాదమైన అబ్ కీ సర్కార్.. కిసాన్ సర్కార్ అని దేశం మొత్తం ప్రచారం చేస్తామని పేర్కొన్నారు కేటీఆర్. తెలంగాణ పల్లెలు ప్రగతి పథంలో నడుస్తున్నాయన్నారు. నాబార్డ్, ఎఫ్సీఏ నివేదికలను కూడా నమ్మరా అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలా మారిందన్న కేటీఆర్.. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాతో పోటీ పడుతున్నామని చెప్పారు.
దేశ ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని.. కేంద్రం ఎవరి కోసం పని చేస్తుందని ప్రశ్నించారు కేటీఆర్. మోటార్లకు మీటర్లు ఎందుకు పెట్టాలని నిలదీశారు. తెలంగాణలో ఏం జరుగుతుందో దేశం మొత్తం చేస్తామని తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలో కదం తొక్కుతామని స్పష్టం చేశారు. ఆనాడు అనాగరికంగా ఏడు మండలాలను ఏపీలో కలిపారని మండిపడ్డారు. లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రాలో కలిపేశారని.. అలాంటి వీళ్లు ఇప్పుడు విద్యుత్ గురించి మాట్లాడడం హాస్యాస్పదమని చురకలంటించారు.
కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా పవర్ హాలిడేలు ఉండేవని గుర్తు చేశారు కేటీఆర్. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? అని అడిగారు. ఆనాడు కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అనేది నిజం కాదా అని నిలదీశారు కేటీఆర్.