ప్రపంచస్థాయి సంస్థలకు హైదరాబాద్ వేదిక అవుతుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. షామీర్‌పేటలో ఏర్పాటు చేసిన టీఎస్ఐఐసీ బయోటెక్ పార్క్‌లో ఫెర్రింగ్ ప్లాంట్‌ను ఆయన సోమవారం ప్రారంభించి మాట్లాడారు. 30 బిలియన్ యూరోలతో ఫెర్రింగ్ కంపెనీ ఏర్పాటయిందన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి కావాల్సిన మందుల తయారీ ఇక్కడ జరుగుతుందని చెప్పారు. మహిళల ఆరోగ్య కోసం ఫెర్రింగ్ ఫార్మా కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు.
మహిళల హెల్త్ కేర్ ఉత్పత్తుల్లో హైదరాబాద్ టాప్ ప్లేసులో ఉందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక విధానం గొప్పగా ఉండటం వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. టీఎస్‌ఐఐసీ బయోటెక్ పార్కులో ఏర్పాటైన ఈ ప్లాంట్ ద్వారా 110 మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. స్విట్జర్లాండ్ వేదికగా కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతాయని మంత్రి వెల్లడించారు.
రాబోయే రోజుల్లో లైఫ్ సైన్సెస్ రంగం మరింత పురోగమించేలా సర్కార్ చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ చెప్పారు. ప్రపంచ స్థాయి ఉన్నత ప్రమాణాలతో జీనోమ్ వ్యాలీ నడుస్తోందని అన్నారు. త్వరలో జీనోమ్ వ్యాలీలో మరిన్ని ప్రముఖ సంస్థలు ఏర్పాటు కానున్నాయని మంత్రి వెల్లడించారు.
వచ్చే ఏడాది నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ మరింత ముందుంటుందన్నారు. తన అమెరికా టూర్ వల్ల హైదరాబాద్‌కు రూ. 7500 కోట్ల పెట్టుబడులు రానున్నాయని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులతో పాటు పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.