కురిసిన ప్రతీ వర్షపు చినుకు మూసీలోకి వెళ్లేలా.. రూ.900 కోట్లకుపైగా నిధులు వెచ్చించి వ్యూహాత్మక నాలాలు అభివృద్ధి చేశామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ మల్లాపూర్‌లో వైకుంఠధామాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఉప్పల్ కూడలిలో రూ.450 కోట్లతో పైవంతెనకు శంకుస్థాపన చేశారు మంత్రి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నగరంలో రూ.3,866 కోట్లతో ఎస్టీపీలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నాచారంలో రూ.75 కోట్లతో ఎస్టీపీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉప్పల్ కూడలికి రెండు వైపులా పైవంతెనలు నిర్మించనున్నట్టు వెల్లడించారు. రూ.35 కోట్లతో నిర్మించిన స్కైవాక్ ను వచ్చే నెలలో ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే రూ.6 కోట్లతో శిల్పారామాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిశాక లబ్ధిదారులందరికీ 2 పడకల ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. స్థలాలున్న పేదలకు ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షలు ప్రభుత్వం నుండి అందించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు మంత్రి. చర్లపల్లి ఆర్‌యూబీ పూర్తి చేసి ప్రారంభిస్తామని మంత్రి తేల్చి చెప్పారు.
అదేవిధంగా లబ్ధిదారులందరికి కొత్త పింఛన్లు అందజేస్తామన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద పాఠశాలలు అభివృద్ధికి రూ.7,300 కోట్లతో అభివృద్ధి చేపట్టినట్టు వెల్లడించారు. ఈ ఏడాది నుంచే పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ కు నలువైపులా 4 వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తుకుంటున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్.