హైదరాబాద్ లో మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కొత్తగూడలో నిర్మించిన వంతెనను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎస్ఆర్డీపీ పథకంలో భాగంగా 3 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. దాదాపు రూ.263 కోట్లతో నిర్మించిన ఈ వంతెన వల్ల కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరాయి. బొటానికల్ గార్గెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ లను కలిపేలా ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. దీనికి అనుబంధంగా అండర్ పాస్ ను కూడా ఏర్పాటు చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ నాయకత్వంలో నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. రాబోయే 50 సంవత్సరాలకు సరిపడా నీటి కోసం కార్యక్రమాలు చేపట్టామన్నారు. కాళేశ్వరం, సుంకిశాల మంచినీటి సరఫరాను ఏర్పాటు చేశామని వెల్లడించారు. రాష్ట్రానికి హైదరాబాద్ కల్పతరువు లాంటిందని చెప్పారు. అందరికీ ఉపాధి ఇస్తుండటంతో ఎక్కువ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఏకకాలంలో అభివృద్ధి, సంక్షేమం లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని వివరించారు.
ఎస్‌ఆర్డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో దాదాపు 20 పూర్తి చేశామన్నారు కేటీఆర్. మరో 11 ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రాబోయే మూడేండ్లలో నగరానికి 3,500 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామని తెలిపారు. గత వరదలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజిక్ నాలా కార్యక్రమం చేపట్టామన్నారు. మార్చి, ఏప్రిల్ నాటికి ఇది పూర్తి చేస్తామని చెప్పారు.
తనకు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి సోషల్ మీడియాలో మెసేజెస్ వస్తాయని.. అభివృద్ధి, సంక్షేమంపై పని చేస్తున్నామని పేర్కొన్నారు కేటీఆర్. చేసేది ఇంకా ఉందని, కానీ చేసింది కూడా గుర్తించుకోవాలని చెప్పారు. గతేడాది తొలిరోజు షేక్ పేట్ ఫ్లై ఓవర్ ని ప్రారంభించుకున్నామని.. ఇప్పుడు కొత్తగూడ వంతెనను ఈ ఏడాది తొలిరోజు ప్రారంభించామని అన్నారు. కేసీఆర్ విజన్ కి, ఆయన సూచనలకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు మంత్రి కేటీఆర్.