గ్రామీణ ప్రాంతాలకు సైతం ఐటీ ని విస్తరించామని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. కాకతీయ సాండ్ బాక్స్ డెవలప్ మెంట్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. టెక్నాలజీ పరంగా భారత్ ఇంకా వెనుకబడి ఉందని చెప్పారు. జనాభాకు తగ్గట్టుగా అభివృద్ధి సాధించడంలో చైనా ఆదర్శమని కొనియాడారు. ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ ముందు వరుసలో ఉందని తెలిపారు.
ఐటీ ఎగుమతులు రూ.లక్షా 18 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు. లక్ష కిలోమీటర్ల పైప్ లైన్ వేసి కోటి ఇండ్లకు మంచినీరు అందిస్తున్నామని వివరించారు కేటీఆర్. ప్రతి ఇంటికి ఫైబర్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టామని.. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టయిన కాళేశ్వరంను నాలుగేండ్లలో నిర్మించామని చెప్పారు.
మరోవైపు కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ఆయన కాన్వాయ్ ను నిరసనకారులు అడ్డుకున్నారు. కంఠేశ్వర్ చౌరస్తాలో కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్, ఎన్ఎస్ యూఐ నాయకులు అడ్డుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హెలిప్యాడ్ నుంచి భూమారెడ్డి కన్వెన్షన్ లో ఇంటరాక్షన్ కార్యక్రమానికి కేటీఆర్ వెళ్తుండగా ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకులు అడ్డుతగిలారు.
కారుకు ఎదురుగా వచ్చి కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల రక్షణ వలయాన్ని చేధించి కాన్వాయ్ కి అడ్డురావడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. తేరుకొని అక్కడికక్కడే వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంత్రి కేటీఆర్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. అయినా కాంగ్రెస్ నాయకులు మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్నారు.