తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. అర్హులైన లబ్దిదారులకు త్వరలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు అందజేయనున్నట్టు వెల్లడించారు. కైతలాపూర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
త్వరలో రాష్ట్రంలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నామని మంత్రి తెలిపారు. పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే లేదా స్థానిక కార్పొరేటన్ ప్రజల వద్దకే వచ్చి అర్హులైన అందరికీ అందిస్తారని వివరించారు.
అర్హులైనవారికి అందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ముందు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఉండేదని గుర్తు చేశారు మంత్రి. అప్పట్లో పెన్షన్ రూ. 200, రూ. 500 మాత్రమే ఉండేవని వివరించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెన్షన్ల సంఖ్య 40 లక్షలకు పెరిగిందని తెలిపారు. రూ. 200 ఉన్న పెన్షన్.. ఇప్పుడు 2000 అయిందని స్పష్టం చేశారు. ఆ తర్వాత రూ. 3000 వేలకు పెరిగిందని వివరించారు మంత్రి. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వం పెన్షన్లకు 8 వందలకోట్లు ఖర్చుపెడితే.. తెలంగాణలో పదివేల కోట్లు పెన్షన్లకు ఖర్చవుతోందని లెక్కలు చెప్పారు కేటీఆర్.