గ్యాస్ సిలిండర్ ధర పెంపు పై మోడీ సర్కార్ ను మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. 8 ఏండ్ల పాలనలో 170శాతం పెంపుతో ప్రపంచంలోనే అత్యధిక రేటుకు వంటగ్యాస్ ను అమ్ముతూ మోడీ సర్కార్ రికార్డు సృష్టించిందన్నారు.
ప్రధాని తీసుకుంటున్న అస్తవ్యస్థ ఆర్థిక విధానాలతో వంట గదుల్లో మంట పుడుతోందన్నారు. తాజాగా 50 రూపాయల పెంపుతో ఈ ఏడాదిలో 244 రూపాయల మేర గ్యాస్ బండ రేటు పెరిగిందన్నారు. ఈ ధరల పెంపుతో మోడీ పాలనను చూసి అరాచకత్వం కూడా సిగ్గుతో తలదించుకుంటుందని మండిపడ్డారు.
ఓవైపు రూపాయి విలువ పడిపోతుంటే మరో వైపు పెట్రోల్ ధరలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయని చెప్పారు. నిత్యావసరాల ధరలు మండిపోతుండటంతో ప్రతి కుటుంబానికి బడ్జెట్ భారంగా మారిందన్నారు.
దేశంలో కొత్త ఉద్యోగాలు రావడం లేదని, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయన్నారు. దీంతో ప్రజల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలతో ప్రజల రక్తాన్ని మోడీ ప్రభుత్వం పీల్చి వేస్తోందని ఆయన అన్నారు.