రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యూకే పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తెలంగాణలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను అక్కడి సంస్థలకు, కంపెనీలకు వివరిస్తున్నారు. తాజాగా.. యునైటెడ్ కింగ్‌డం-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన మంత్రి.. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు.
యూకేలోని ప్రముఖ కంపెనీల బృందాలకు, రాష్ట్రంలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను వివరించారు. టీఎస్ ఐపాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ ఫైనాన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా-లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ కోసం తీసుకొచ్చిన పాలసీలు.. వాటితో ఇప్పటిదాక తెలంగాణకు వచ్చిన భారీ పెట్టుబడుల వివరాలను కంపెనీల ప్రతినిధులకు వివరించారు.
భూమి, నీరు, విద్యుత్ సదుపాయాలు, నాణ్యమైన మానవ వనరులు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని కంపెనీ యాజమాన్యాలకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను సాదరంగా స్వాగతిస్తున్నామని మంత్రి తెలిపారు. అసలు సిసలైన కాస్మోపాలిటన్ కల్చర్ హైదరాబాద్‌లో మాత్రమే ఉందని పేర్కొన్నారు.
భారత్ లో జీవించేందుకు అత్యంత అనువైన నగరంగా హైదరాబాద్ ను తీర్చి దిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి విషయంలో అనేకసార్లు అవార్డులను అందుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు.. లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు హైదరాబాద్ హాబ్ గా మారిందని వివరించారు కేటీఆర్.