గవర్నర్ వ్యవస్థపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్‌ను రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలని ఆయన అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజకీయాలను మాట్లాడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్‌లో ప్రధాని ఫోటోలు పెట్టుకుంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
రాజకీయాల్లో ఉన్న వారికి గవర్నర్ పదవి ఇవ్వవద్దని గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మోడీ అన్నారని ఆయన చెప్పారు. ఎవరు ఎన్నుకున్నారని గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బ్రిటిష్ కాలంలో ఉన్న రాజ్‌పత్‌ను కర్తవ్య పత్‌గా మార్చారని, మరి గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ వాళ్లు పెట్టిందన్నారు. మరి అలాంటి వ్యవస్థ ప్రస్తుత ఎందుకని ఆయన ప్రశ్నించారు.
దేశానికి గవర్నర్ వ్యవస్థతో ఏం ఉపయోగమని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదన్నారు. నియోజకవర్గాల విభజన చేస్తామని హమీలు ఇచ్చి మర్చిపోయారన్నారు. ప్రస్తుత బడ్జెట్ బీజేపీకి చివరి బడ్జెట్ అని ఆయన అన్నారు. 2014 లో తూతూ మంత్రం బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఇదే చివరి అవకాశమన్నారు.
తెలంగాణకు రైల్వే లైన్ ఇవ్వలేదన్నారు. కేటాయించినవి కూడా పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు, విద్యా సంస్థల ఏర్పాటుపై కేంద్రం హామీలు ఇచ్చిందని, కానీ వాటిని విస్మరించిందన్నారు.
ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో వేసిన రైల్వే లైన్ 100 కిలో మీటర్ల కంటే తక్కువేనన్నారు.
లింగంపల్లి-విజయవాడకు కొత్త రైలు మాత్రమే ఇచ్చారని అంతకు మించి ఇంకేం ఇవ్వలేదని మండిపడ్డారు. తాను చెప్పింది అవాస్తమని నిరూపిస్తే ఏ శిక్ష కైనా సిద్ధమని ఆయన సవాల్ చేశారు. ఈ బడ్జెట్ లో రైల్వే లైన్ల కు నిధులు కేటాయించేలా నలుగురు బీజేపీ ఎంపీలు ప్రయత్నం చేయాలన్నారు.