సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. హైదరాబాద్‌లో రాజకీయ పరిస్థితులు టీఆర్ఎస్‌ను కలవరడపెడుతున్నాయి. పైనుంచి చూస్తే అంతా బానే కనిపిస్తున్నా.. తరచి చూస్తే కారుపై అన్ని ప్యాచులే కనిపిస్తున్నాయి. సమీపంలో ఎన్నికలేవీ లేకపోవడంతో పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోందన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాను రాను ప్రభుత్వం నుంచి ప్రయోజనం ఆశించే నేతలే తప్ప.. పార్టీ కోసం పనిచేసేవారే కరువైపోతున్నారని టీఆర్ఎస్ హైకమాండ్ గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇదిలా జరిగితే వచ్చే ఎన్నికల నాటికి ప్రమాదం తప్పదన్న అంచనాతోనే.. హైదరాబాద్‌లో కారుకు రిపేర్లు చేసే పనని కేటీఆర్‌కు అప్పగించినట్టుగా తెలుస్తోంది.
దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన ప్రాంతీయ పార్టీ అని టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి ఆదరణ సంగతి ఎలా ఉన్నా.. రాజధానిలో మాత్రం వరెస్ట్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చేదు అనుభవాలను ఆ పార్టీ ఎదుర్కొన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. చాలా నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరుకోకపోగా.. ఒక నియోజకవర్గంలో అయితే సభ్యత్వాలు చేయించడం తన వల్ల కాదని.. పార్టీ ఇన్‌ఛార్జి ఏకంగా రిసిప్ట్ బుక్కులనే వెనక్కి పంపినట్టుగా తెలుస్తోంది.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో రాణించినా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నగర పరిధిలోని ఐదు ఎంపీ స్థానాల్లో.. ఒక్కటంటే ఒక్కటే గెలుచుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, భువనగిరి స్థానాల్లో ఓడిపోయి.. మెదక్ ఎంపీ స్థానాన్ని మాత్రమే నిలబెట్టుకుంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చావుతప్పి కన్నులొట్టబోయినట్టుగా తప్పించుకుంది. ఈ పరిణామలన్నింటి క్రమంలో కొన్నాళ్లు కేటీఆర్.. పూర్తిగా హైదరాబాద్‌పైనే ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. ఈ నెల 7 న జరిగే సమావేశం కూడా అందులో భాగమేనని చెప్తున్నారు.