కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ పాలనలో జరిగిన స్కాముల గురించి ప్రశ్నల వర్షం కురిపించారు.
1. గుజరాత్ లో నిషేధం ఉన్నా లిక్కర్ తాగి 42 మంది చనిపోవడం పెద్ద స్కామ్
2. నిబంధనలు కాదని అదానీకి 6 ఎయిర్ పోర్టులు ఇవ్వడం స్కామ్
3. అదానీ నుంచే బొగ్గు కొనాలని పాలసీ చెయ్యడం స్కామ్
4. అదానీ పోర్టుల్లో మాదకద్రవ్యాలు దొరికినా విచారణ లేకపోవడం స్కామ్
5. గంగవరం, కృష్ణ పోర్టును లాక్కోవడం స్కామ్
ఇవన్నీ మోడీ పాలనలో జరిగిన స్కాములని వీటిపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు కేటీఆర్. ఈ సందర్భంగా ప్రధానికి రెండు సవాళ్లు విసిరారు.
1. మాకు విచారణను ఎదుర్కొనే దమ్ముంది? మోడీకి ఉందా?
2. అదానీతో బంధంపై మోడీ లైడిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమా?
ఇలా.. మోడీకి సవాల్ చేసిన చేసిన కేటీఆర్.. ఎమ్మెల్యేల ఎర కేసుపైనా స్పందించారు. బీఎల్ సంతోష్ కోర్టుకు రాకుండా దాక్కున్నారని విమర్శించారు. కానీ, కవిత మాత్రం విచారణను ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. మోడీ ఉడుత ఊపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరన్న ఆయన.. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని.. చివరికి న్యాయమే గెలుస్తుందని తెలిపారు. మళ్లీ చెబుతున్నా కవితకు ఇచ్చినవి ఈడీ సమన్లు కాదు.. మోడీ సమన్లు అంటూ వ్యాఖ్యానించారు.
రాజకీయ వేధింపులను రాజకీయంగానే ఎదుర్కొంటామని చెప్పిన కేటీఆర్.. తెలంగాణలో బీజేపీకి గత ఎన్నికల్లో 107 సీట్లలో డిపాజిట్ గల్లంతైందని గుర్తు చేస్తూ చురకలంటించారు. కచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే బీజేపీ అంతు చూస్తామని.. కవిత ఇష్యూ తర్వాత కూడా వేధింపులు ఉంటాయని తెలుసని ధైర్యంగా పోరాడతామని చెప్పారు. బీజేపీ నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.