– నువ్వా నేనా అన్నట్టు తెలంగాణ రాజకీయం
– మూడోసారి అధికారం కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు
– ఒక్క ఛాన్స్ అంటున్న బీజేపీ, కాంగ్రెస్
– పోటాపోటీగా నేతల మధ్య మాటల యుద్ధం
– ప్రజలంతా తమవైపే ఉన్నారంటున్న కేటీఆర్
– మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా!
– సీఐఐ సమావేశంలో ఇంట్రస్టింగ్ కామెంట్స్
ఈసారి తెలంగాణలో త్రిముఖ పోరు ఖాయమని అంతా అనుకుంటున్నారు. కానీ, పార్టీలు మాత్రం తమకు పోటీ ఎవరూ లేరని ధీమాతో ఉన్నాయి. బీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కాంగ్రెస్, బీజేపీ అంటున్నాయి. తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటున్న కేసీఆర్ కు రెండు సార్లు ఛాన్స్ ఇచ్చారు.. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండని హస్తం నేతలు అంటున్నారు. ఇవన్నీ కాదు.. డబుల్ ఇంజన్ సర్కార్ తోనే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని కమలనాథులు చెబుతున్నారు. అయితే.. మంత్రి కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలంగాణ వార్షికోత్సవ సమావేశం హైదరాబాద్ బేగంపేట్ ఐటీసీ కాకతీయలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. మీ నుంచి వస్తున్న స్పందన చూస్తే మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమకే అధికారం ఇవ్వాలని కోరారు. పారిశ్రామికంగా తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని తమలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పని చేస్తే అద్భుతమైన అభివృద్ధి దేశం సాధించవచ్చని అన్నారు.
లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపు అయ్యాయని.. 2030 నాటికి 250 బిలియన్ డాలర్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి ఎన్నో అనుకూలతలు, బలాలు ఉన్నాయన్న ఆయన.. 9 బిలియన్ టీకాలు హైదరాబాద్ లోనే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం మన డివైజెస్ పార్కులోనే ఉందన్నారు. తెలంగాణలో అతి పెద్ద మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని.. దేశానికే హైదరాబాద్ మొబిలిటీ కేంద్రంగా మారుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
వ్యాపారులు, పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందన్న కేటీఆర్.. ఇన్వెస్టర్లు ముందుకు వస్తే సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామన్నారు. ఇన్నోవేషన్స్ ను ప్రోత్సహించడానికి టీ-వర్క్స్ ప్రారంభించామని.. ప్రైవేట్ రంగంలో ఉపగ్రహాల తయారీ మొట్టమొదటగా హైదరాబాద్ లోనే జరిగిందన్నారు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు నగరంలోనే తమ కేంద్రాలు ఏర్పాటు చేశాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు కేటీఆర్.
ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని తెలిపారు మంత్రి. ముందుచూపుతో ఈవీ, బ్యాటరీల తయారీ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పత్తికి దేశంలో మంచి డిమాండ్ ఏర్పడిందన్నారు. టెక్స్‌టైల్ రంగంలోనూ పెట్టుబడులకు విస్తృత పరిధి ఉందని చెప్పారు. భారీ స్థాయిలో కాకతీయ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని.. కొంగరకలాన్ లో ఫాక్స్ కాన్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని వివరించారు. ఆ సంస్థకు 200 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉండే పరిశ్రమలకు నీటి సమస్య కూడా లేదని స్పష్టం చేశారు కేటీఆర్. ఈ సందర్భంగా వచ్చిన రెస్పాన్స్ ను చూసి.. మళ్లీ అధికారం తమదే అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.