ఏపీ మంత్రి గౌతం రెడ్డి మరణవార్త అందర్నీ షాక్ కు గురి చేసింది. ఈమధ్యే కరోనాను జయించిన ఆయన.. గుండెపోటుతో చనిపోవడం పట్ల ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
గౌతం రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ లోని ఇంటికి తీసుకెళ్లారు. మంగళవారం నెల్లూరు జిల్లాకు తరలిస్తారు. బుధవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరనున్నాయి.
మంత్రి కేటీఆర్.. రాజమోహన్ రెడ్డిని కలిసి ధైర్యం చెప్పారు. గౌతం రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని చెప్పారు కేటీఆర్. ఇటు ఏపీలో రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది ప్రభుత్వం.
సోమవారం ఉదయం 6 గంటలకు నిద్ర లేశారు గౌతం రెడ్డి. 7 గంటల సమయంలో రెండో అంతస్తులోని సోఫాలో కూర్చుని ఉండగా చిన్నగా గుండె నొప్పి ప్రారంభమైంది. 7.12 గంటలకు డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పారు గౌతం రెడ్డి. 7.15గంటలకు గుండెపోటుతో సోఫా నుంచి కిందకి ఒరిగిపోయారు.
7.18 గంటలకు పరుగుపరుగున వచ్చి మంత్రి ఛాతిమీద చేయితో నొక్కి స్వల్ప ఉపశమనం కలిగించాడు డ్రైవర్ నాగేశ్వరరావు. 7.22 కు నొప్పి ఎక్కువ అవుతోంది భార్యకు చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి వెళదామని బయలుదేరారు. 7.27 గంటలకు మంత్రి ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో చేరుకున్నారు. 8:15 గంటలకు పల్స్ బాగానే ఉందని.. ప్రయత్నిస్తున్నామని తెలిపారు డాక్టర్లు. 9.13 గంటలకు మేకపాటి చనిపోయిన విషయాన్ని నిర్ధారించారు. 9.15 కు చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.