కేంద్రానికి తెలంగాణ ఇచ్చినదానికంటే.. తెలంగాణకు కేంద్రం ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా రాజీనామా చేస్తానని సవాల్ చేశారు మంత్రి కేటీఆర్. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ తరఫున కేటీఆర్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. నామినేషన్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని కేంద్రం విపక్షాలను వేధిస్తోందని మండిపడ్డారు కేటీఆర్. దాన్ని తిరస్కరించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న అన్ని పార్టీలకు ఉంటుందన్నారు. బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న వైఖరికి వ్యతిరేకంగా, అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి విపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు తమ పార్టీ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు.
యశ్వంత్ సిన్హాకు మద్దతివ్వాలని మమత, పవార్ కోరారని తెలిపారు కేటీఆర్. అయితే.. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముపై తమకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు అవకాశం ఇచ్చామని బీజేపీ పదేపదే చెబుతోందని.. మరి.. గిరిజనులు, దళితుల కోసం ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. గిరిజన జనాభా పెరిగిందని అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చెప్పారు. ఇంతవరకు దానిని కేంద్రం ఆమోదించలేదని గుర్తు చేశారు.
బీజేపీకి గిరిజనుల మీద ప్రేమ లేదన్నారు. తాము ప్రతిపక్షాల కూటమిలో ఉన్నామని ఎవరు చెప్పారని ప్రశ్నించిన కేటీఆర్.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల అభ్యర్థికి మాత్రమే మద్దతిచ్చామన్నారు. బీజేపీకి కేసీఆర్ బొమ్మ తప్ప వేరే దిక్కులేదని.. మోడీ ఫోటోకు చెప్పులేసి గాడిద మీద ఊరేగించగలం కానీ అలా చేయబోమని విమర్శించారు. అందరికీ విద్యుత్ సౌకర్యం ఇచ్చామన్న మోడీ మాటలు అబద్ధమని.. రాజ్యాంగాన్ని కాలరాసి మెజారిటీ లేకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్.