– ప్రీతి ఘటనపై స్పందించిన కేటీఆర్
– విపక్షాల ఆరోపణలపై ఆగ్రహం
– బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
– చిల్లర వ్యాఖ్యలు చేయొద్దని ప్రతిపక్షాలకు వార్నింగ్
కొద్దిరోజుల క్రితం ప్రీతి ఘటనలో లవ్ జిహాద్ అనుమానం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిందితుడికి సహకారం అందిస్తున్నారని ప్రభుత్వం, పోలీసులపై విమర్శలు చేశారు. ఇటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రీతి విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రీతి ఘటనపై స్పందించారు.
హన్మకొండ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ లో పర్యటించిన కేటీఆర్.. అక్కడ నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రీతి ఘటనపై మాట్లాడారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. అది సైఫ్ కానీ, సంజయ్ కానీ ఎవరైనా వదిలి పెట్టేది లేదన్నారు. ప్రీతి ఘటనను కొందరు కావాలనే రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
‘‘వరంగల్ ఎంజీఎంలో దురదృష్టవశాత్తూ కాలేజీలో జరిగిన గొడవల్లో మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అంశాన్ని కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం. మంత్రులు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ వేదిక నుంచి ప్రీతి కుటుంబానికి తమ పార్టీ, ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా సంతాపం ప్రకటిస్తున్నాం. కొంతమంది రాజకీయంగా చిల్లరమల్లర మాటలు మాట్లాడొచ్చు కానీ ప్రభుత్వం, పార్టీ పరంగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే వదిలిపెట్టం. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా శిక్ష వేస్తాం’’ అని తెలిపారు కేటీఆర్.
ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడం, చిల్లరమల్లర మాటలు మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. ఇక స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో రూ.125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేశారు కేటీఆర్. కేసీఆర్ ను విమర్శిచేందుకు విపక్షాలకు కారణం దొరకట్లేదని.. ఏ తప్పు దొరక్క కుటుంబ పాలన అని విమర్శిస్తున్నారన్నారు. ‘‘స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి చెబుతున్నా.. మాది కుటుంబ పాలనే అని బరాబర్ చెబుతున్నా’’ అని స్పష్టం చేశారు. దేశంలో అత్యుత్తమ గ్రామాలు, మున్సిపాలిటీలు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణలో అని కేంద్రమే చెబుతోందన్నారు. కేంద్రం మాటలు చెప్పడం తప్ప ఒక్క పైసా పని చేయలేదని ధ్వజమెత్తారు మంత్రి కేటీఆర్.