తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా ప్రజలతో కాంటాక్ట్‌లో ఉంటారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వాటి పరిష్కారించేందుకు కృషి చేస్తుంటారు. తాజాగా ట్విట్టర్‌లో ఓ మహిళ విజ్ఞప్తిపై ఆయన స్పందించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద మెట్రో, బస్సులు నడవని సమయాల్లో ముఖ్యంగా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు మహిళలకు ఆటోలు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ ను ఓ మహిళ కోరింది. దీనిపై స్పందించిన ఆయన…
రాత్రి సమయాల్లో మహిళల కోసం పోలీసుల ఆధ్వర్యంలో నడిచే ఆటోలు ఏర్పాటు చేయాలని వెంటనే డీజీపీ అంజనీ కుమార్ కు ఆయన సూచించారు. ఆ ఆటోల్లో ట్రాకింగ్ మెకానిజం ఏర్పాటు చేయాలని, ఆ వ్యవస్థను రాష్ట్ర మంతటా అమలు చేయాలని ఆయన ఆదేశించారు.
దీనిపై డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. మంత్రి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. మహిళలు సురక్షితంగా ప్రయాణం చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.