దేశంలో అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వృద్ది రేటు(సీఏజీఆర్) 15 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. దావోస్‌లో నిర్వహించిన డబ్ల్యూఈఎఫ్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరం)లో బయోటెక్ రివల్యూషన్‌పై చర్చా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. డబ్ల్యూహెచ్ఓ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పెట్టుబడులను తెలంగాణ సర్కార్ ఆకర్షిస్తోందని ఆయన అన్నారు.
కొవిడ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలోని లోపాలు కనిపించాయన్నారు. కరోనా పీక్స్‌లో ఉన్న సమయంలో తమ దగ్గర అవసరమైనన్ని వెంటిలేటర్లు లేవని న్యూయార్క్ గవర్నర్ అన్నారని చెప్పారు. ఆ పరిస్థితుల్ని అంచనా వేసినప్పుడు లైఫ్ సైన్సెస్‌కు పెద్దపీట వేయాలన్న ఆలోచన కలిగిందని వెల్లడించారు.
మూడో వంతు వ్యాక్సిన్లు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. తెలంగాణలోనే 40 శాతం ఫార్మసీ ఉత్పత్తులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ, కేంద్రానికి మధ్య సంబంధాలు సరిగాలేవన్న మీడియా ప్రశ్నకు ఆయన బదులిస్తూ…
దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణ తరహాలో పరిపాలన సాగిస్తే, దేశం ఎప్పుడో 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదన్నారు. కరోనా ఉన్నా, నోట్ల రద్దు చేసినా, చివరకు కేంద్రం సహకరించకున్నా వృద్ధి రేటులో రాష్ట్రం దూసుకు వెళ్తోందన్నారు. తమకు కేంద్రం సహకరించి ఉంటే రాష్ట్రం మరింత వేగంగా వృద్ధిని సాధించి ఉండేదన్నారు.
మోడీ ఈ దేశ ప్రధాని అవ్వడానికి ముందు భారత దేశ అప్పు 56 లక్షల కోట్లు ఉండేదన్నారు. కానీ మోడీ ప్రధాని అయ్యాక ఆ అప్పు విపరీతంగా పెరిగిపోయిందన్నారు. గత 8ఏండ్ల మోడీ పాలనలో దేశం కొత్తగా వంద లక్షల కోట్లు అప్పుల పాలైందని కేటీఆర్ విమర్శించారు.