హుజూరాబాద్ లో ఏదో చేస్తామని బీజేపీ కల్లబొల్లి మాటలు చెప్పిందని విమర్శించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. నియోజకవర్గంలోని జమ్మికుంటలో మంగళవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గానికి ఈటెల రాజేందర్ ని పరిచయం చేసింది కేసీఆరే అని గుర్తు చేశారు. అలాంటిది కేసీఆర్ ని పట్టుకుని ఈటెల విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈటెల రాజేందర్ కు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని దూషిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని మోడీ చెప్పారని.. ఆ డబ్బులు ఎవరి ఖాతాల్లో పడ్డాయో చెప్పాలని సెటైర్లు వేశారు.
మసీదులు తవ్వడం కాదు.. దమ్ముంటే కాలువలు తవ్వుదాం రా అని బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్ విసిరారు. మాట్లాడితే హిందుస్థాన్, పాకిస్థాన్ అంటారని ఎద్దేవా చేశారు. రూ.400 ఉన్న గ్యాస్ ధరను వెయ్యి రూపాలు చేసినందుకా.. మోడీ దేవుడయ్యాడు? అంటూ నిలదీశారు.
జాతీయ రహదారులంటున్న బండి సంజయ్.. వాటిపై 100 లక్షల కోట్లు అప్పు చేసింది నిజం కదా? అని ప్రశ్నించారు. గిరిజనుల రిజర్వేషన్ల బిల్లు తొక్కి పెట్టారని, గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదని, ఎన్నడూ లేనంతగా ధరలు, ద్రవ్యోల్బణం పెరిగిందని కేటీఆర్ దుయ్యబట్టారు మంత్రి కేటీఆర్.