అసెంబ్లీలో ప్రతిపక్ష నేతల ప్రశ్నలపై సుదీర్ఘంగా మాట్లాడారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. తెలంగాణ అభివృద్ధి కనిపించకపోవడం శోచనీయమని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రతి కుటుంబంలోని అవ్వ, తాతకు పెన్షన్ ఇస్తూ పెద్ద కొడుకులా ఆసరా అవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 4కోట్ల మందిని తోబుట్టువుగా చూసుకుంటున్నారని చెప్పారు.
కంటి వెలుగుతో వృద్ధులకు కంటి చూపు, గురుకులాలు, కాలేజీలతో పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్న కేసీఆర్.. ఒంటరి మహిళలకు ఫించన్ ఇస్తూ పెద్దన్నలా ఆదుకుంటున్నారని వివరించారు కేటీఆర్. 12 లక్షల మందికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సాయం అందించి కేసీఆర్ మేనమామలా అండగా నిలిచారన్నారు.
తమది ముమ్మాటికీ కుటుంబపాలనే అని.. కాకపోతే రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలు తమ కుటుంబసభ్యులేనన్నారు కేటీఆర్. సీఎం కేసీఆర్ ఆ కుటుంబానికి పెద్ద అని చెప్పారు. అందుకే కుటుంబపాలన అంటున్న ప్రతిపక్షాల విమర్శల్ని తాము స్వీకరిస్తామని తెలిపారు.
తెలంగాణలో వేట కుక్కలు తిరుగుతున్నాయని.. ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాయని సెటైర్లు వేశారు కేటీఆర్. బీజేపీ నేత ఈటల రాజేందర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి.. ఇటువైపు ఉన్నప్పుడు బాగున్న ఈటల అటు వెళ్లాక పూర్తిగా మారిపోయారు అంటూ వ్యాఖ్యానించారు.
పోడు భూముల విషయంలో తప్పు పట్టాల్సి వస్తే.. మోడీ పనితీరు గురించి కూడా మాట్లాడాలని అన్నారు. 30 ఏళ్ళలో అత్యంత ఎక్కువగా నిత్యావసర ధరలు పెరిగాయని వివరించారు. 45 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగిందని.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన సిలిండర్ ధర భారతదేశంలోనే ఉందని చెప్పారు. పెట్రోల్ ధర కూడా భారత్ లో ఎక్కువ అని విమర్శించారు కేటీఆర్.