ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రానితో యుద్ధమేనంటోంది టీఆర్ఎస్. దీనికోసం నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు మీడియాకు వివరాలు ప్రకటించారు. రాష్ట్రంలో పండిన వరిధాన్యం కొనాలని విజ్ఞప్తి చేస్తే.. కేంద్రం రైతులను, ప్రజలను అవమానించిందని మండిపడ్డారు. బీజేపీ సర్కార్ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 4న మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడతామని.. రైతులందరూ ఇందులో పాల్గొనాలని కోరారు.
నిరసన కార్యక్రమాలను టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ఇంచార్జ్ లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. రైతుల పక్షాన వెళ్లిన మంత్రులను అవమానించిందని.. కేంద్రానికి అన్నదాతల పట్ల కనీస దయ లేదని విరుచుకుపడ్డారు. యాసంగిలో వరి సాగు వద్దని రైతులకు విజ్ఞప్తి చేశామన్న కేటీఆర్.. ఎంత పండించినా కొంటామని బండి సంజయ్ చెప్పారని గుర్తు చేశారు. రైతులను వరి పండించేలా బీజేపీ నేతలు రెచ్చగొట్టారన్నారు. కానీ.. ఇప్పుడు కేంద్రం చేతులెత్తేసిందని విమర్శించారు. ప్రతి గింజా కొంటామని బండి సంజయ్ గతంలో చెప్పిన వీడియో క్లిప్స్ ను మీడియాకు వినిపించారు కేటీఆర్. అలాగే బండి మానసిక పరిస్థితి సరిగా ఉందో లేదో తమకు తెలియదన్నారు. ఆయన మెంటల్ కండిషన్ పై అనుమానాలున్నాయని విమర్శించారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రైతులను కన్ ఫ్యూజ్ చేసేలా మాట్లాడారని పేర్కొన్నారు. ప్రతి ఏడాది కేంద్రం ఆనవాయితీగా ధాన్యం కొంటుందని ఆయన చెప్పారన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడిన వీడియోను కూడా మీడియా ముందుంచారు. వాళ్ల మాటలు విని కొంతమంది రైతులు వరి వేశారని, మరి వాటిని ఎవరు కొనుగోలు చేయాలో బండి సంజయ్, కిషన్ రెడ్డే చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నేతల తీరుకు నిరసనగానే ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు కేటీఆర్. కేంద్రం వైఖరిని ఎండగట్టాల్సిన బాధ్యత రైతులు, ప్రజలపై ఉందన్నారు. ఈ నిరసనలకు సమాంతరంగా.. లోక్ సభ, రాజ్యసభలోనూ ఎండగడతామని చెప్పారు. ధాన్యం కొనాలని అన్ని గ్రామాలు, మండల పరిషత్ లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లు, పీఏసీఎస్ ల నుంచి ప్రధానికి, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు తీర్మానాలు పంపించామని వివరించారు. ఇప్పటికీ వాటిపై ఎలాంటి స్పందన లేదని ఫైరయ్యారు.
ఇక.. ఏప్రిల్ 6న తెలంగాణలోని నాలుగు ప్రధాన జాతీయ రహదారులపై నిరసన చేపడుతామని తెలిపారు కేటీఆర్. 7న 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ఉంటాయని చెప్పారు. 8న రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో ప్రతి రైతు తన ఇంటిమీద నల్లజెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతీ గ్రామంలో కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. చివరగా ఏప్రిల్ 11న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు కేటీఆర్. కేంద్రం మెడలు వంచేందుకు ఈ ఐదంచెల కార్యాచరణ రూపొందించామని వివరించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తగ్గే వరకు తాము తగ్గేది లేదని స్పష్టం చేశారు కేటీఆర్.